నేను ఒంటరిని కాను – జగన్

ప్రజాసమస్యలు తెలుస్తాయని తనతోపాటు ఓదార్పుయాత్రలో పాల్గొనమని శాసనసభ్యులను చేతులు జోడించి ప్రార్థించానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో మూడవరోజైన ఆదివారం జగన్ ఓదార్పుయాత్రను సాగించారు. వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి ఎస్‌సి కాలనీలోని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆకాలనీకి చెందిన గోన దేవమ్మ సమస్యలను జగన్‌కు విన్నవించారు. గుడిపాటిపల్లి, కట్టికిందపల్లె, పి. నాగులవరం, రామగోపాలపురం, గన్నవరం, వెలిగండ్ల తదితర గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. జగన్ మాట్లాడుతూ తన వెంట శాసనసభ్యులు లేకపోయినా ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోలేదని ప్రతివాడి గుండెల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓదార్పుయాత్ర సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనపై ప్రేమానురాగాలు చూపిస్తున్నారని ఆయన తెలిపారు. జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. కాబోయే సిఎం అంటూ ప్రజలు నినాదాలు చేసినప్పటికీ జగన్‌నుండి ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పేరును కాని, రాష్ట్రప్రభుత్వ పనితీరుపై ఎక్కడ కూడా విమర్శలు చేయకుండా జగన్ కేవలం తనతండ్రి వైఎస్‌ఆర్ పేరునే ఉచ్చరిస్తూ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
జిల్లాకు చెందిన ఐపిఎస్ అధికారి ఆవుల రమేష్‌రెడ్డి ఏర్పాటుచేసిన వైఎస్‌ఆర్ స్మృతివనాన్ని జగన్ ప్రారంభించారు. ఓదార్పుయాత్రలో రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కాటం అరుణమ్మ, దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాదురెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ రావు, కాకినాడ శాసనసభ్యుడు వి చంద్రశేఖరరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఇదిలాఉండగా కనిగిరి నియోజకవర్గంలో జగన్ పర్యటన సాగించినప్పటికీ ఆ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఓదార్పుకు డుమ్మాకొట్టారు. కనిగిరి మాజీ శాసనసభ్యుడు ముక్కు కాశిరెడ్డి అన్ని తానై ఈ ఓదార్పుయాత్రలో పాల్గొని విజయవంతం చేశారు.
ఓదార్పులో ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు
ఒంగోలు: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో చేపట్టిన ఓదార్పుయాత్రకు ఇతర జిల్లాలనుండి ముగ్గురు శాసనసభ్యులు వచ్చి తమ మద్దతు ప్రకటించారు. ఆదివారం ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల, హనుమంతునిపాడు తదితర మండలాల్లో జగన్ ఓదార్పుయాత్ర నిర్వహించారు. రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాద రావు, కాకినాడ శాసనసభ్యుడు చంద్రశేఖరరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి పాల్గొని జగన్ ఓదార్పుయాత్రకు మద్దతు ప్రకటించారు. తనకు కూడా జగన్ ఓదార్పుయాత్రలో పాల్గొన వద్దని ఆదేశాలు ఉన్నాయని అయితే తాను మాత్రం ఓదార్పుయాత్రలో పాల్గొంటున్నాని తెలిపారు. మంత్రి బాలినేని కూడా తనమంత్రి పదవిపోయినప్పటికీ జగన్ ఓదార్పుయాత్రలో పాల్గొంటానని మరోసారి అధిష్ఠానానికి సంకేతాలు పంపారు.




