పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రభుత్వ విధానాలే ఆటంకం

04.09
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందకపోవడానికి ప్రభుత్వమే కారణమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘పారిశ్రామికాభివృద్ధికి కాలుష్య వాతావరణం వల్ల వచ్చే అడ్డంకులు’ అనే అంశంపై కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీస్‌ (సిఐఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌. తులసిరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌ రెడ్డి, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌ నారాయణ, పిఆర్‌పి సీనియర్‌ నేత కోటగిరి విద్యాధరరావు, టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యులు బి. వినోద్‌కుమార్‌, ఎమ్‌ఎల్‌సి ఎస్‌ఏ జాఫ్రీ పాల్గొన్నారు. సమావేశానికి సిఐఐ మాజీ ఛైర్మన్‌ వై. హరీష్‌ చంద్ర ప్రసాద్‌ అధ్యక్షత వహించారు.
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు చేయడం లేదు – రాఘవులు
ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ప్రజలకు మేలు చేయడంలేదని బివి రాఘవులు అన్నారు. ఉదాహరణకు సోంపేట థర్మల్‌ ప్రాజెక్టు వల్ల రైతులకు, బాక్సైట్ల వల్ల గిరిజనులకు ఉపయోగం కలగకపోగా తీవ్రమైన నష్టం వాటిల్లుతోందన్నారు. ఎన్నికలకు ముందు కల్లబొల్లి మాటలు చెప్పే రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. దీనికి కొన్ని పార్టీలు సహకరిస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా శ్రమించకుండా డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచిస్తున్న్నారని అన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు వెనుకబడిన ప్రాంతంలో నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జలయజ్ఞం పథకం ప్రవేశపెట్టేముందు కూడా తాము చేసిన సూచనలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని చెప్పారు. అయితే తాము చెప్పిందే ఇప్పుడు జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారని, అందులో 30వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టులూ వస్తున్నాయని పేర్కొన్నారు. కానీ విద్యుత్తు మన రాష్ట్రానికి ఎంత అవసరం, ఇతర రాష్ట్రాలకు ఎంత అమ్ముకోవచ్చనే అవగాహన లేకుండా పోతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంటర్‌టెయిన్మెంట్‌కు ఇచ్చినంత ప్రాధాన్యత ఎంటర్‌ప్రైనర్స్‌కు ఇవ్వడం లేదన్నారు.
అభివృద్ధికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు : నారాయణ
పారిశ్రామిక అభివృద్ధికి కమ్యూనిస్టులు వ్యతిరేకంకాదని కె నారాయణ అన్నారు. పరిశ్రమల స్థాపన జరిగినప్పుడే కార్మికులు అభివృద్ధి చెందుతారని అన్నారు. రెండు పంటలు పండే వ్యవసాయ భూమలను సెజ్‌ల పేరుతో లాక్కోవడం అన్యాయమని అన్నారు. ఏయే పరిశ్రమలు నెలకొల్పాలి, ఏ వస్తువులను ఎంత మేరకు ఉత్పత్తి చేయాలి, ఎంత మందికి ఉపాధి దొరకుతుందని ప్రభుత్వం ఆలోచించడం లేదని అన్నారు. చట్టాలను సవరించి ఎపిఐఐసిని వాడుకుని సెజ్‌ల ద్వారా లాక్కున్న భూములను రూ.30లక్షల నుంచి కోటి రూపాయలకు ఎకరం చొప్పున అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల పేదలు, రైతులు నష్టపోతున్నారని చెప్పారు. వ్యవసాయానికి ఉపయోగంగా లేని భూముల్లో పరిశ్రమలు నెలకొల్పినట్లయితే బాగుంటుందని సూచించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని ప్రభుత్వం అరికట్టలేకపోతోందని పేర్కొన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడే తిరుగుబాటు మొదలవుతుందని అన్నారు. అప్పుడు తాము ప్రజల పక్షాన పోరాడాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
పరిశ్రమల స్థాపనకు టిడిపి అనుకూలమే : యనమల
పరిశ్రమల స్థాపనకు టిడిపి అధికారంలో ఉన్నప్పుడూ అనుకూలంగానే ఉందని, ఇప్పుడూ స్వాగతిస్తుందని యనమల రామకృష్ణుడు అన్నారు. కొన్ని పరిశ్రల వల్ల విపరీతమైన కాలుష్యం వస్తోందని దీంతో ఆయా పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. పరిశ్రమలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఉందని తెలిపారు.
అభివృద్ధిలో నాలుగో స్థానంలో రాష్ట్రం : వినోద్‌
పారిశ్రామిక రంగంలో గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉందని వినోద్‌కుమార్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు వచ్చిన వారికి పరిశ్రమల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రానున్న రోజుల్లోనైనా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. సెజ్‌ల ప్రారంభానికి ముందు చర్చ జరిగినప్పుడు రాష్ట్రానికి ఒక్కటి లేదా రెండు మాత్రమేనని చెప్పారు. కానీ ఇప్పుడు వందల సెజ్‌లు పుట్టుకొచ్చాయని విమర్శించారు. అనంతపురంలో ఐదు ఎకరాలు కావాల్సిన సెజ్‌కు 500 ఎకరాల స్థలం సేకరించారని చెప్పారు. అక్కడ ప్రజలు ఎదురు తిరగడంతోనే వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు.
రాజకీయ పార్టీల వల్లే ఈ దుస్థితి : కిషన్‌ రెడ్డి
ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పలేకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలదేనని కిషన్‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇవ్వడం ప్రతిపక్షంలోకి రాగానే ప్రశ్నించడం ఆనవాయితీగా మారిందని అన్నారు. రాజకీయ పార్టీల పోటీతత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. రింగురోడ్డు, నేషనల్‌ హైవే వల్ల ప్రజలకు కొంత ఉపయోగం ఉన్న మాట వాస్తవమేనన్నారు. కానీ సెజ్‌ల పేరుతో రైతుల భూమలు లాక్కొవడం దారుణమన్నారు. ఒక్కో సెజ్‌కు 12వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు. జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరాలో ఆంధ్రప్రదేశ్‌ ఘోరంగా విఫలమైందని అన్నారు. కోటగిరి విద్యాధరరావు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు. యువకులు తిరగబడితే పరిస్థితులు తారుమారవుతాయని హెచ్చరించారు.

Leave a Reply

free website analytics