పొలిట్ బ్యూరోలో నేతల ఆత్మవిమర్శ ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయం

“గత ఆరేళ్లలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని అడ్డంగా, నిలువుగా దోచుకొన్నారని అందరికీ తెలుసు. పాలన కుప్పకూలింది. రోశయ్య అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నారు. సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యమవుతున్నాయి. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మనం దూసుకుపోగలగాలి. కానీ మనకు రావాల్సినంత అడ్వాంటేజీ రావడం లేదు. ఎందుకీ స్తబ్దత? లోపం ఎక్కడ ఉంది!?”- ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులకు వేసిన ప్రశ్న. ఎన్టీఆర్ భవన్‌లో శనివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్టీ ముఖ్యులంతా దీనిపై మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా లోతైన విశ్లేషణలతో నేతలు ఆత్మ విమర్శ చేసుకున్నారు.
ప్రాంతీయ ఉద్యమాలతో ప్రజల్లో భావోద్రేకాలు చెలరేగి ప్రజాసమస్యలు మరుగునపడుతున్నాయని, ఇదే సమస్య టీడీపీని కూడా ప్రాంతాలవారీగా విభజించడంతో స్తబ్దతకు దారితీసిందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. దీంతో, “సమస్యలున్నాయి. కానీ ఇంత స్తబ్దత ఎందుకు? రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్ఠానం కుంపటి పెట్టింది. మరోపక్క, జగన్ గొడవ నడుస్తోంది. రాష్ట్రంలో అందరి దృష్టి కాంగ్రెస్‌పైనే ఉంది. టీడీపీ ఏం చేస్తోందన్న చర్చ లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? మనం ఏం చేయాలన్నదే మనముందున్న సమస్య” అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ అంశంతో పార్టీలోని రెండు ప్రాంతాల నేతల మధ్య చీలిక వచ్చిందని, దీంతో వారి మధ్య అగాధం పెరిగి ఆ ప్రభావం పార్టీ పనితీరుపైనా ప్రసరిస్తోందని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. నాగం జనార్దన్‌రెడ్డి తప్ప.. ఇరు ప్రాంతాల నాయకులూ ఈ చర్చలో పాల్గొన్నారు.
అన్ని ప్రాంతాలకూ అన్ని ప్రాంతాల నేతలు
రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊపు తీసుకురావడానికి.. స్తబ్దత సమస్యను నివారించడానికి మొత్తం పార్టీ నాయకులంతా ప్రజా సమస్యలపై క లిసికట్టుగా పని చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. 25మంది ముఖ్యనేతలు చురుగ్గా పనిచేస్తే పార్టీ క్రియాశీలమవుతుందని, గతాన్ని మరచి ముందడుగు వేయాలని బాబు సూచించారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు తెలంగాణపై ఎవరు ఏం చెప్పాలన్న దానిపై ముందుగానే స్పష్టత ఇస్తే బాగుంటుందని కడియం శ్రీహరి సూచించగా.. చంద్రబాబు అంగీకరించారు.
గ్రూప్ – 1 పరీక్ష వ్యవహారం టీడీపీ పొలిట్‌బ్యూరోలో నేతల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మొదట ఈ అంశాన్ని నాగం లేవనెత్తారు. తెలంగాణ విద్యార్థుల మనోభావాల మేరకు గ్రూప్-1లో రిజర్వేషన్ కల్పించాలని తాను డిమాండ్ చేశానని, వెంటనే పయ్యావుల కేశవ్ విభేదించారని… ఇలా మాట్లాడితే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రకటనలను చూపించి టీడీపీ రెండు నాల్కలతో మాట్లాడుతోందని కేసీఆర్ విమర్శిస్తున్నారని, సీమాంధ్ర నేతలు ఓపిక పడితే మంచిదని కడియం అన్నారు. ఈ వివాదంపై తాము మాట్లాడకుండా ఉండడం సాధ్యం కాదని, కాంగ్రెస్‌లోనూ ఇరు ప్రాంతాలవారు మాట్లాడుతున్నారని గుర్తించాలని కాల్వ శ్రీనివాస్ బదులిచ్చారు. ఆయనను యనమల సమర్థించారు. ఎమ్మార్‌పై సరిగ్గా వ్యవహరించలేదని కడియం అనడంతో.. ఏపీఐఐసీ వ్యవహారాలపై ఈనెల 14న భారీఎత్తున ఆందోళన నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పార్టీపరంగా ఆరు అంశాలపై సీనియర్ నేతలతో నియమించిన కమిటీల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.




