పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేత రమణ

వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలంలో శుక్రవారం ఉదయం నుంచి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత కొండల రెడ్డి అలియాస్ టెక్ రమణ మృతి చెందారు. రాష్ట్రంలో నెలకొన్న అస్థిర రాజకీయ పరిస్థితులను ఆసరాగా చేసుకుని నల్లమలపై పట్టు సాధించేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు చెక్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఒక్క రోజులోనే ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలను పోలీసులు ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మావోయిస్టు అగ్రనేత కొండలరెడ్డి అలియాస్ టెక్ రమణ మృతిచెందాడు. టెక్ రమణ గతంలో దక్షిణ తెలంగాణ జోన్ కమిటి కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పని చేస్తున్నారు. ఇతను తెరాస మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సోదరుడు కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కొండల రెడ్డి అలియాస్ టెక్ రమణతోపాటు మరికొంతమంది మావోయిస్టులు కొడిశాల-పందాల మధ్య సంచరిస్తున్నట్లు గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం ఉదయమే రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్‌లో తారసపడిన మావోయిస్టులపై పోలీసులు కాల్పులు ప్రారంభించారు. దీనికి ప్రతిగా మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో టెక్ రమణ మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇదిలావుండగా శుక్రవారం ఉదయం జరిగిన పోలీసు ఎదురు కాల్పుల ఘటనపై టెక్ రమణ సోదరుడు, తెరాస నేత రామలింగారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితమే రమణను పోలీసులు మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారని ఆయన మీడియాకు తెలిపారు. పోలీసులు పథకం ప్రకారమే ఇక్కడకు తీసుకొచ్చి కాల్చి చంపారని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా సంఘటనా స్థలంలో ఏకె-47 సహా పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.




