పోలీసు శాఖ ప్రతిష్టను ఇనుమడింపచేస్తా – నూతన డిజిపి అరవిందరావు

Ar.8
రాష్ట్రంలో పోలీసు శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేస్తానని నూతన డిజిపిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన కె.అరవిందరావు అన్నారు. రాగద్వేషాలు, పక్షపాతం లేకుండా ప్రజల మన్ననలు పొందేవిధంగా పని చేస్తానని చెప్పారు. పదవీ విరమణ చేసిన డిజిపి ఆర్‌ఆర్ గిరీష్‌కుమార్ నుంచి ఆయన సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా జీవోను మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విడుదల చేసింది.

Ar.1

అనంతరం నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం డిజిపి కార్యాలయానికి వచ్చి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో అరవిందరావు విధులు చేపడుతూ సంతకం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది గిరీష్‌కుమార్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు జీప్‌లో మాజీ డిజిపిని నిలబెట్టి జీప్‌కు తాడు కట్టి పోలీసు బ్యాండ్, మ్యూజిక్ మధ్య తాళ్ళతో లాగుతూ కార్యాలయ ప్రధాన గేటు వరకు తీసుకెళ్ళి ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ చేసిన ప్రతి డిజిపికి ఈ రకమైన ఘన వీడ్కోలు దక్కడం ఎంతో సంతోషం, అనుభూతి కలిగిస్తుంది. సిబ్బంది, అధికారులు తాళ్ళులాగేందుకు ఆసక్తి చూపించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అరవిందరావు విలేఖరులతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీసు వ్యవస్థ మన రాష్ట్రంలో ఉందని, అది మరింత సమర్ధవంతంగా పని చేసేలా కృషిచేస్తానని చెప్పారు.

DEV_0007 - Copy

ముఖ్యంగా శాంతిభద్రతల సమస్యను తొలి ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్ర పోలీసు బాస్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రోశయ్య, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై అపారమైన నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి శాఖకు మంచి పేరు తెస్తానని చెప్పారు. ప్రస్తుతం పోలీసు శాఖలో పెద్దగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మావోయిస్టుల సమస్య ఇప్పటిది కాదని, గత 20 ఏళ్ళ నుంచి ఉందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అద్భుతమైన, చాలా స్పష్టమైన విధానం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఇప్పుడూ అదేవిధానాన్ని అవలంభిస్తామని చెప్పారు. నక్సలిజం అణచివేతకు కొత్త విధానం ఉంటూ ఏమీలేదని, 20 ఏళ్ల కిందట రూపకల్పన చేసిన పద్ధతినే అవలంబిస్తామని స్పష్టం చేశారు. నక్సల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో చాలా కచ్చితమైన వైఖరి వుందని, ఇందుకోసం సరికొత్త దృక్కోణం అవసరం లేదన్నారు. నక్సలైట్ల సమస్యను ఒక్క రోజులో పరిష్కరించడం సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు. నక్సలిజం అంటే ఆవేశం, తుపాకితో కూడినదని, ఆవేశం అనేది మానవులకు ఉండే సహజమైన గుణం అని, తుపాకీ చేబూనడంతోనే సమస్య ఉత్పన్నమవుతుందని, తుపాకీ ధరించడం చట్ట వ్యతిరేకచర్య అని ఆయన వివరించారు. తాము రాగద్వేషాలకు తావులేకుండా, రాజకీయాలకు అతీతంగా ప్రజల మన్ననలు పొందేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యతాంశమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రానున్న రోజులలో ఉద్యమాలతో సంక్లిష్ట పరిస్థితులు నెలకొంటే ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు అప్పటి పరిస్థితులను అర్థం చేసుకుని వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటామని అరవిందరావు స్పష్టంచేశారు. పోలీసుశాఖ ప్రభుత్వంలోని ఇతర శాఖలలో ఒకటని చెప్పారు.  రాష్ట్ర పోలీసు శాఖలో ఎంతో సమర్ధవంతులైన అధికారులు ఉన్నారని, వారందరి సహకారాలతో పని చేస్తానని చెప్పారు. డ్రగ్స్, మహిళలపై నేరాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న వేర్పాటువాదం, సమైక్యవాద ఉద్యమాల ప్రభావం గురించి ఆయన వివరిస్తూ ఈ అంశంపై అప్పటికప్పుడు తలెత్తే పరిణామాలను బట్టి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు.

  • గిరీష్‌కుమార్‌కు ఘన సన్మానం

Ar.4
పదవీవిరమణ చేసిన డిజిపి ఆర్‌ఆర్ గిరీష్‌కుమార్‌ను రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఘనంగా సన్మానించింది. గజపూలమాలతో, శాలువాతో సత్కరించారు. మెమెంటో అందించి తమ అధికారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గిరీష్‌కుమార్ మాట్లాడుతూ మీ అభిమానం, ఆప్యాయం, సహాయ సహకారాలే సమర్ధవంతంగా ముందుకెళ్ళేందుకు తనకు తోడ్పడ్డాయని అన్నారు. పూలమాలలు, బొకేలు అందించేందుకు పోలీసు ఆఫీసర్ల సంఘ నాయకులు పోటీ పడ్డారు.

Leave a Reply

free website analytics