పోలీస్ బాస్‌కు సమస్యల స్వాగతం

సమస్యల తోర ణాలు కొత్త డీజీపీకి స్వాగతం పలుకుతున్నాయి. డీజీపీగా అరవిందరావు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో పలు సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వామపక్ష తీవ్రవాదం, ఉగ్ర వాదం ఎప్పుడు ఏ రూపంలో మాటువేసి రక్తపా తాన్ని సృష్టిస్తాయో తెలియని పరిస్థితి ఉంది. అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణ సమస్య కూడా గోడమీద పిల్లివాటంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు, రంజాన్ ప్రస్తుతం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. ఇదే సమయంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో అతివర్షాల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు అతిపెద్ద ఉస్మానియా యూనివర్శిటీ ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా రాజుకుంటుంది.
రాజకీయ అనిశ్చిత స్థితిగతులు, ఉపద్రవాలు, అప్పుడప్పుడు ఎదురయ్యే విపత్కర పరిస్థితులు పోలీసు శాఖకు సవాల్‌గా మారాయి. అదే సమయంలో నైజీరియన్ మోసాలు, మాదక ద్రవ్యాల సరఫరా, వాడకం, మత్తుమందుల నిషాలో ఉన్నత వర్గాలు, సైబర్ క్రైమ్ తదితర అంశాలు పోలీసులను కలవరానికి గురిచేస్తు న్నాయి. ఇదే సమయంలో అంతర్రాష్ర్ఠ దోపిడీ ముఠాలు, నకిలీ నోట్ల చలామణి, కొత్తపుంతలు తొక్కిన నేరాలు, పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బందిలో పదోన్నతులు కల్పించడం లేదనే నిర్లక్ష్య ధోరణి ప్రస్తుతం పోలీసులను వేధిస్తున్న సవాళ్ళు. అదే సమయంలో పోలీసు శాఖకు చేదోడు వాదోడుగా పనిచేసే హోంగార్డులు, ఇతరత్రా అంతర్గత సమస్యలు కొత్త బాస్‌కు స్వాగతం పలుకుతున్నాయి.
అతిపెద్ద సమస్య వేర్పాటువాదం
పోలీసు శాఖను గత సంవత్సరం ఒక కుదుపు కుదిపిన ప్రత్యేక తెలంగాణా – సమైక్యాంధ్ర ఉద్యమాలు అతిపెద్ద సమస్యగా మారాయి. దీంట్లో అన్ని రాజకీయ వర్గాలు సమైక్యంగా ఉద్యమాలు నిర్వహించడం, రాస్తారోకోలు, బంద్‌లు, విధ్వంసాలు, ప్రాంతీయ విద్వేషాల సమయంలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో చెప్పిన విధంగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పిన అంశం అమలు చేయాలంటే కిందిస్థాయిలో సిబ్బంది సహకారం ప్రధానంగా అవరసమవుతుంది. గత సంవత్సరం నవంబర్ మాసంలో మెదక్ జిల్లా సిద్దిపేటలో ప్రారంభమైన ఉద్యమం చివరకు డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగింది.
తెలంగాణా ప్రశాంత వాతావరణం నెలకొందని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో సమైక్యాంధ్రలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అక్కడి పరిస్థితి ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో విద్యార్థులు ఉస్మానియా యూనివర్శిటీ అగ్నికణంలా రగిలింది. ఇదే సమయంలో పోలీసులు దాదాపు రెండు నెలల పాటు అహరహం శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం శ్రీకృష్ణ కమిటీ ఈ సంవత్సరం డిసెంబర్‌లో నివేదిక అందించనున్న నేపథ్యంలో ఈ యేడాది డిసెంబర్ నుంచి భారీస్థాయిలో ఆందోళనలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసు బాస్‌కు ఈ సమస్యలే ప్రధాన తోరణాలుగా స్వాగతం పలుకుతున్నాయి.




