ప్రజలకు సంక్షేమ పథకాలను ఎరచూపి రాష్ట్ర సంపదను దోచుకుతిన్నారు – చంద్రబాబు

రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు, దురాగతాలు, రౌడీయిజం, గూండాయిజంపై తెలుగుదేశం పార్టీ తొలి నుంచి పోరాడుతోందని ఆయన చెప్పారు. ఈ దౌర్జన్యాలను గూండాయిజాన్ని భవిష్యత్తులోనూ ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటామని ఆయన చెప్పారు. గత ముఖ్యమంత్రి వైఎస్ ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనునిత్యం హత్యా రాజకీయాలకు పాల్పడుతూ ప్రత్యర్థి వర్గాలను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని అంతమొందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. వైఎస్ హత్యారాజకీయాలకు చనిపోయిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అంతమొందించిన కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఓ ప్రైవేటు న్యూస్ చానల్ ఏర్పాటు చేసిన వైఎస్ కుటుంబ హత్యా రాజకీయాలు అన్న అంశం పై మాట్లాడిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. వైఎస్ కుటుంబం చేసిన దౌర్జన్యాలవల్ల రాష్ట్రంలో ఇప్పటిదాకా 206 కుటుంబాలు రోడ్డునపడ్డాయని వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 196 మందిని పొట్టన బెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. హత్యారాజకీయాలపైనే వైఎస్ తన రాజకీయ జీవితాన్నంతా నెట్టుకొచ్చారని అనునిత్యం తనకు అడ్డంగా వచ్చేవారిని చంపడం, ప్రతికారం తీర్చుకోవడం ఆయనకు అలవాటని ఆరోపించారు. రాజకీయ హత్యలపైనే వైఎస్ పూర్తి నమ్మకం ఉండేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఏనాడూ హత్యారాజకీయాలను ప్రోత్సహించలేదని అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల సమస్యలను పరిష్కరించడం, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీలపై అలుపెరుగని పోరాటం చేసిన ఘనత తెదేపాదని ఆయన అన్నారు.




