ప్రధానికి వర్గీకరణపై కెసిఆర్‌ వినతికి నిరసన తెలంగాణ భవన్‌ను ముట్టడించిన ఉద్యమ జెఎసి

03.09
ఎస్సీల వర్గీకరణ కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు వినతిపత్రం ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ ఉద్యమ జెఎసి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. తెలంగాణ ఉద్యమ జెఎసి చైర్మన్‌ దేవని సతీష్‌మాదిగ, వైస్‌ చైర్మన్‌ జి.చెన్నయ్య నేతృత్వంతో వందలాదిమంది కార్యకర్తలు ఒక దశలో తెలంగాణ భవన్‌లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కెసిఆర్‌ డౌన్‌డౌన్‌
అంటూ నినాదాలు చేస్తూ అక్కడే దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు సతీష్‌మాదిగ, జెన్నయ్య మాట్టాడుతూ గతంలో ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్‌ వర్గీకరణ కారణంగా తెలంగాణలోని మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని మాల మాదిగలు అంగ్లేయుల పరిపాలనలో క్రైస్తవ విద్యా సంస్థల ద్వారా ఉన్నత విద్యను అభ్యసించి ఎస్సీ రిజర్వేషన్‌ ఉద్యోగాలనన్నింటినీ దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జోన్ల విధానం అమలులోకి వచ్చిన తరువాత తెలంగాణ ఎస్సీలకు అరకొరగా ఉద్యోగాలు వచ్చాయనీ, 1956లో తెలంగాణలో ఉద్యోగం చేయడానికి సీమాంధ్ర నుంచి వచ్చిన ఎస్సీలు ఇక్కడే స్థిరపడి వారి కొడుకులు, మనుమలు స్థానిక పత్రాలు పొంది ఇక్కడి ఎస్సీలను అన్యాయానికి గురి చేస్తున్నారన్నారు.  నిజానికి తెలంగాణలోని మాలలు మాదిగల అవకాశాలను దోచుకోలేదనీ, వీరిద్దరి అవకాశాలను సీమాంద్ర మాలమాదిగలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కారణంగా తెలంగాణలోని మాలమాదిగల మధ్య విభేదాలు సృష్టించవద్దనీ, వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు వద్దని వారు కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాధన కోసం తీవ్రంగా ఉద్యమించాలని, ఇందుకోసం తాము కూడా మద్దతిస్తామని వారు కెసిఆర్‌కు స్పష్టం చేశారు.

Leave a Reply

free website analytics