ప్రధాని వ్యాఖ్యలపై నోరు మెదపరేం? – నాగం
ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకాభిప్రాయ సాధన వ్యాఖ్యలపై కెసిఆర్, కోదండరామ్ ఎందుకు మౌనం వహించారో చెప్పాలని టిడిపి తెలంగాణ నేత నాగం జనార్థన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సమస్యకు ఏకాభిప్రాయ సాధన ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ వాదులు ఖండించక పోవడం వారి చిత్తశుద్ధిని శంకించవలసి వస్తోందని నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. లాయర్లపై దాడి వల్లే జెఎసి నుంచి తెలుగుదేశం పార్టీని బహిష్కరించామని కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నేతలు లాయర్లపై దాడి ఘటనకు క్షమాపణలు కూడా చెప్పారని, అయినా అదొక రాజకీయ కుట్ర అని ఆయన అన్నారు. ఆ తర్వాత లాయర్లు పార్టీ కార్యాలయానికి రెండుసార్లు వచ్చి మెమొరాండం ఇచ్చినా కాదనలేదని తెలిపారు. అలాగే తనపై దాడి చేసినప్పుడు జెఎసి నుంచి తాను క్షమాపణ కోరలేదన్న విషయాన్ని నాగం గుర్తుచేశారు.





