ప్రభుత్వానికి అటు విద్యార్థులకు “పరీక్ష” – పోలీస్‌ వలయంలో పరీక్ష కేంద్రాలు

appc
ఇంకొన్ని గంటల్లో ఎపిపిఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష. కమిషన్‌ పరీక్షను అడ్డుకునేందుకు తెలంగాణా వాదులు సిద్ధమయ్యారు. బంద్‌కు పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామంటున్నారు. ఎపిపిఎస్సీలో తమకు 42 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేకుండా పరీక్ష ఎలా సాగుతుందో చూస్తామంటూ హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు తెలంగాణా ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి. తెలంగాణాలోని రాజకీయ పార్టీలూ ముందు కొచ్చాయి. పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉన్నా సర్వీస్‌ కమిషన్‌ మాత్రం
వెనక్కు తగ్గేదే లేదని చెప్పింది. ఇప్పటికే ఎబివిపి కార్యకర్తలు కమిషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇంకోవైపు తెలంగాణా విద్యార్థి సంఘాలు సచివాలయాన్ని దిబ్బంధం చేసి ఉద్రిక్తత సృష్టించారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష ఎలా సాగుతుందనేది సర్వత్రా ఆందోళనగా ఉంది. పరీక్షా కేంద్రాలను తుపాకుల పహారాలోకి తీసుకున్నామని, ఎలాంటి భయం లేదని పోలీసు వర్గాలు ప్రకటించాయి. మూడంచెల భద్రత వ్యవస్థను కల్పించామని ధైర్యం చెబుతున్నారు. సమస్య ఇంతటితోనే సరిపోలేదని, ఆందోళనకారులను అడ్డుకునే నిర్బంధం కొత్త సమస్యలకు కారణమవుతుందని తెలంగాణావాదులు అంటున్నారు. రాష్ట్ర రాజధానితో సహా, యావత్‌ తెలంగాణాలో ఎపిపిఎస్సీ పరీక్ష నిర్వహణ గందరగోళంలో పడింది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఇన్విజిలేటర్లను ఎక్కడ నుంచి తెస్తారు? సీమాంధ్ర నుంచి తీసుకొస్తారా? అదే జరిగితే పరిస్థితి ఇంకెంత ఉద్రిక్తంగా ఉంటుంది? అనే ఆందోళన ప్రభుత్వం వర్గాల్లో కన్పిస్తోంది. తాజాగా సమావేశమైన ఎపిపిఎస్సీ బోర్డు పరీక్షను ఆపడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. ప్రభుత్వం ఇలాంటి సాహసం చేసినా తెలంగాణా ప్రశాంతంగా ఉండొచ్చేమోకానీ, సీమాంధ్ర నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చు. పరీక్షను యథాతథంగా నిర్వహించకపోతే ఊరుకునేదే లేదని సీమాంధ్ర విద్యార్థి జెఎసి ప్రకటించింది. దీనికి రాజకీయంగానూ మద్దతు లభిస్తోంది. పెరుగుతున్న ఒత్తిడి, అడ్డుపడుతున్న నిబంధనలు.. మొత్తం మీద గ్రూప్‌ వన్‌ పరీక్ష గందరగోళంలో పడినట్టే.
రహస్య వ్యూహం: గ్రూప్‌వన్‌ పరీక్షపై సర్వీస్‌ కమిషన్‌ స్పష్టమైన అభిప్రాయం చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తెలంగాణాలో తాజా పరిస్థితిపై వివరాలు తెప్పించుకున్నారు. అనేక చోట్ల ఉద్రిక్తతకు అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆందోళనకారులు వివిధ మార్గాల్లో పరీక్షలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అవసరమైతే పరీక్ష కేంద్రాల్లోకి పెట్రోల్‌ బాంబులతోనూ తెగబడే వీలుందని ఓ అధికారి తెలిపారు. పోలీసులు ఎంత రక్షణ కల్పించినా, విద్యార్థి సంఘాలకు ఉద్యోగ సంఘాల మద్దతు ఉందని, వారి ద్వారా పరీక్ష పత్రాలు లీకయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ఆగిపోయినట్టేననే వాదన విన్పిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. శ్రీకృష్ణ కమిషన్‌ నివేదిక ఇచ్చే గడువు దగ్గరపడుతోంది. కొద్దికాలంగా తెలంగాణా శ్రేణులు స్తబ్దుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌వన్‌ వివాదం కలిసి వచ్చిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీన్ని అడ్డంపెట్టుకుని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు రహస్య వ్యూహం రూపొందించినట్టు ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారం. ఈ క్రమంలో కొన్ని అసాంఘికశక్తులు ప్రభావం చూపే వీలుందని భావిస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో అలజడి సృష్టించేందుకు కొన్ని బృందాలు సిద్ధంగా ఉన్నాయని అనుమానిస్తున్నారు. అవసరమైతే హింసాత్మక ధోరణిలో వెళ్ళేందుకు వెనకాడవద్దని రహస్య సమాచారం వెళ్ళిందని ఓ ఇంటిలిజెన్స్‌ అధికారి చెప్పారు. తెలంగాణా వ్యాప్తంగా అనేక కేంద్రాల వద్ద ఒక మోస్తరు యుద్ధవాతావరణం నెలకొందని పోలీసులు అంటున్నారు. మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినా, ప్రశాంతంగా పరీక్షలు జరగుతాయన్న నమ్మకం పోలీసుల నుంచి రావడం లేదు.

Leave a Reply

free website analytics