ప్రభుత్వ విధానాలపై ఉద్యోగ, కార్మిక వర్గాలతో నేడు దేశమంతటా సమ్మె

047.09
కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యుపిఎ-2 సర్కారుపై కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన కోట్లాది మంది కార్మికులు,ఉద్యోగులు మంగళవారం సమరశంఖం పూరించనున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగం, కార్మిక చట్టాల అమలు, అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత, లాభసాటిగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, తదితర ప్రధాన సమస్యలపై కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా మంగళవారం దేశవ్యాప్త సమ్మెను నిర్వహించనున్నాయి. జాతీయ స్థాయిలో ఐఎన్‌టియుసి, సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎమ్‌ఎస్‌, ఎఐయుటియుసి, టియుసిసి, యుటియుసి, ఎఐసిసిటియు, నేషనల్‌ ఇండిస్టియల్‌ ఫెడరేషన్‌ కార్మిక సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదికగా ఏర్పడ్డాయి. 63 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా కార్మిక సంఘాలన్నీ ఐక్యవేదికగా ఏర్పడటం చారిత్రాత్మకంగా నిలిచింది. దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలు నేడు ‘ధరాభారం’తో విలవిల్లాడిపోతున్నారు.
యుపిఎ మొదటిసారి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి (2006) ఇప్పటి వరకూ అనేక మార్లు ధరలు పెరిగాయి. పెరిగిన ఈ ధరల ముందు వేతన సంఘం సిఫార్సులు వెలవెలబోతున్నాయి. 2006 నుంచి ఇప్పటి వరకూ బియ్యం, పప్పుల ధరలు 120 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 200 నుంచి 300 శాతానికి పెరిగాయి. పళ్ల ధరలు 330 శాతం, పాల ధరలు 40 శాతం పెరిగాయి. వంటనూనెల ధరలు 95 శాతం పెరగ్గా, చేపల ధరలు 140 శాతం, మాంసం ధరలు 100 శాతం, సబ్బుల ధరలు 75 శాతం, దుస్తుల ధరలు 50 శాతం పెరిగాయి. ఇదే సమయంలో విద్య, వైద్యానికయ్యే ఖర్చులు అనేక రెట్లు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ఉద్యోగులు, కార్మికులకు జీతం, డిఎలు పెరిగినప్పటికీ ధరల ముందు అవి దిగదుడుపుగా ఉన్నాయి. అంతోఇంతో జీతం వచ్చే ఉద్యోగులు, కార్మి కుల పరిస్థితే ఇలా ఉంటే ఇక దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సామాన్యుల పరిస్థితి ఊహకందకుండా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచడంద్వారా ఈ ధరల సమస్య నుంచి దేశ ప్రజానీకాన్ని రక్షించాలంటూ కేంద్ర కార్మిక సంఘాలు యుపిఎ-2 ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞప్తి చేశాయి.
ఆ సూచనలను కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగానైనా పట్టించుకోలేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, ప్రయివేటీకరణల విష ఫలితాల వల్ల రెండు దశాబ్దాలుగా దేశంలోని ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, శ్రామికుల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టీకరణ విధానాల వల్ల ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఉపాధి నష్టాలు, అతి తక్కువ వేతన చెల్లింపులు, భరించలేని జీవన పరిస్థితులు, పెరుగుతున్న పనిగంటల భారం, విస్తరిస్తున్న కాంట్రాక్టీకరణ, క్యాజువలీకరణ, జౌట్‌ సోర్సింగ్‌కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చట్టంలో పేర్కొన్న సమాన పనికి సమాన వేతనం అనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. అసంఘటితరంగ కార్మికులకు ఎలాంటి పరిమితుల్లేకుండా ‘సార్వజనీన సమగ్ర సామాజిక భద్రత’ను వర్తింపజేసేందుకు పెద్దమొత్తంలో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలన్న కార్మిక సంఘాల డిమాండ్‌ను కేంద్రం పెడచెవిన పెట్టింది. నామమాత్రపు నిధుల కేటాయింపు, పరిమితం చేసే నిబంధనలతో ఈ సామాజిక భద్రతా చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటోంది.
ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల్ని ఉపసంహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన లోటు బడ్జెట్‌ను పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కోల్‌ ఇండియా లిమిటెడ్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ఐసి, హిందూస్థాన్‌ కాపర్‌, ఎన్‌ఎండిసి, తదితర లాభాల బాటలో ఉన్న సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసింది. తద్వారా యుపిఎ-2 సర్కారు ప్రయివేటీకరణకు రాచబాట వేస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, సమాచార, రవాణారంగాల్లోని కార్మికులు, ఉద్యోగులు, ఫ్యాక్టరీలు, గనులు, తోటలు, పోర్ట్‌ అండ్‌ డాక్స్‌, రక్షణ సంస్థలు, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు, తదితర రంగాలకు చెందిన కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులతో పాటు గృహ కార్మికులు, స్వయం ఉపాధి, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఈ సమ్మెకు సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, ఎపీఎన్జీవో, టిఎన్జీవో, పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, టిఎన్‌టియుసి, ప్రజారాజ్యం ట్రేడ్‌ యూనియన్‌, తదితర కార్మిక సంఘాలు నేతృత్వం వహిస్తున్నాయి. వీటితోపాటు ఆర్టీసీలోని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. అనేక ఇతర ప్రజాసంఘాలు ఈ దేశభక్తియుత ఆందోళనకు తమ మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని ట్రేడ్‌ యూనియన్లు కార్మికవర్గానికి విజ్ఞప్తి చేశాయి.

Leave a Reply

free website analytics