ఫలించని మొయిలీ రాయబారం – యాత్రతో పార్టీకి ప్రయోజనమే మొయిలీకి జగన్ స్పష్టీకరణ

03.09
క్లైమాక్స్‌కు సర్వం సిద్ధమైంది. అధిష్ఠానం ఇచ్చి న ఆఖరి అవకాశాన్నీ కడప ఎంపీ జగన్ కాదన్నారు. ఓదార్పును ఆపేందుకు ససేమిరా అనేశారు. అధిష్ఠానం దూతగా ఇడుపులపాయకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ మాటను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓ దార్పు యాత్రను ప్రారంభించి తీ రుతానని జగన్ స్పష్టంచేశారు. మాట తప్పడం.. మడమ తిప్పడం తమ ఇంటా వంటా లేదంటూ తెగేసి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు తన యాత్రలో పాల్గొంటేనే మంచిదంటూ.. పార్టీ యావత్తూ తన బాటలోకే రావాలని పరోక్షంగా సూచించారు.
కావాలంటే ఆ తర్వాత పార్టీతో కలిసి ఓదార్పులో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తానంటూ ముక్తాయించారు. పైగా తన ఓదార్పుతో పార్టీకి ప్రయోజనమేనంటూ సూత్రీకరించారు. ఇప్పటిదాకా యాత్రలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోని విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రకాశం,నెల్లూరు జిల్లా నేతలను యాత్రకు రప్పించేందుకు జగన్ వర్గం ప్రయత్నాలు ప్రారంభించడం మరో కీలకాంశం.
మొత్తానికి జగన్ స్పందన అధిష్ఠానానికి తీవ్ర ఆగ్రహం కలిగించినట్టు తెలిసింది.ఎంత చెప్పినా జగన్ వినిపించుకోకపోవడంతో.. ‘ఐ యామ్ హెల్ప్‌లెస్. ఇక నా చేతుల్లో ఏమీ లేదు’ అంటూ, వీరప్ప మొయిలీ నిట్టూర్చారు. జగన్‌ను ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లిపోయారు. ఇదీ గురువారంనాటి సీన్. ఇక అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరం. యాత్ర ప్రారంభిస్తే ఏ క్షణమైనా షోకాజ్ ఇచ్చేందుకు అది సిద్ధమవుతోందన్నది తాజా సమాచారం!

Leave a Reply

free website analytics