ఫీజులపై పోటెత్తిన విద్యార్థులు

apttn-1280866711268
బోధనా ఫీజుల, స్కాలర్‌షిప్పుల బకాయిలు చెల్లింపు, హాస్టళ్ల సమస్య పరిష్కారించాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు రోడ్డెక్కారు. పలు జిల్లాలలో కలెక్టరేట్లను ముట్టడించారు. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టర్‌ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అతి చేయడంతో వారి మధ్య తోపులాట జరిగింది. దీనితో ఆగ్రహావేశాలకు లోనైన పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వందల సంఖ్యలో విద్యార్థులను అరెస్టు చేశారు. కాగా ఇది ఆరంభం మాత్రమేననీ, రానున్న రోజుల్లో వినూత్న రీతిలో ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.
మెదక్‌, కరీంనగర్‌, నిబామాబాద్‌, వరంగల్‌, అదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఎబివిపి విద్యార్థులు ధర్నా చేశారు. హైదరాబాద్‌లో పిడిఎస్‌యు విద్యార్థులు ఉద్యమించారు. వరంగల్‌లో మూడు వేల మంది ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఒే రోజు వివిధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిందే తప్ప కనీసం విద్యార్థి సంఘాలకు ఎటువంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం.

DSC-0008
సుందరయ్య విజ్క్షాన కేంద్రం నుండి ప్రారంభమైన పిడిఎస్‌యు ర్యాలీ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ మీదుగా ఇందిరా పార్కుకు చేరుకుంది.  ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో పాటు పలువురు నాయకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బోధనా ఫీజులు చెల్లించడం ప్రభుత్వానికి ఇష్టం లేదనీ, ఈ సంక్షేమ పథకాలన్నీ ఎన్నికల పథకాలని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుండి విద్యార్థులు వినతి పత్రం ఇచ్చేందుకు సెక్రటేరియట్‌కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ముందుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీ చార్జ్‌ చేసి 70 మంది విద్యార్థులను అరెస్ట్టు చేశారు. పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన రాము, రమేష్‌, వెన్నెల, తదితర విద్యార్థులు వివిధ ఆసుపత్రులతో చికిత్స పొందుతున్నారు.
పలు విద్యార్థి సంఘాల నాయకులు సూర్య ప్రతినిధితో మాట్లాడినప్పుడు తమ మనోవేదనను పంచుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌ మాట్లాడుతూ, రాష్ర్టవ్యాప్తంగా 6.40 లక్షల పైచిలుకు హాస్టళ్లు ఉండగా వాటిలో దాదాపు నాలుగు వేల హాస్టళ్లను సందర్శించామని చెప్పారు. తాము చేపట్టిన సైకిల్‌ యాత్ర ద్వారా ఇప్పటికి 800 మండలాలలోని హాస్టళ్లను పరిశీలించామనీ చెబుతూ, అన్నింటా అసౌకర్యాలేనని ఆయన విమర్శించారు. నాసిరకం భోజనం తినలేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ బోధనా ఫీజులు, స్కాలర్‌షిప్పుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అనేక విద్యా సంస్థలకు విద్యార్థులు చేరుకోవాలంటే బస్‌ రూట్లు ఉన్నప్పటికీ బస్‌ సౌకర్యం ప్రభుత్వం కల్పించలేదని ఆరోపించారు.  పిడిఎస్‌యు రాష్ర్త అధ్యక్షుడు ఓ అశోక్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా సాచ్యురేషన్‌ పద్ధతిలో స్కాలర్‌షిప్పులు, బోధనా ఫీజలు చెల్లింపులు జరగాలని కోరారు. ప్రభుత్వ కుటిల యత్నాలకు పాల్పడితే అందుకు దీటుగా సమాధానం చెప్పేందుకు విద్యార్థి లోకం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గమనించి భావి పౌరులైన విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
3న రాష్ర్ట వ్యాప్త నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు  – ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు తీర్పు బీసీ విద్యార్థుల పట్ల మరణశాసనంగా మారిందని రాష్ర్ట బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి ర్యాగ రమేష్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు కె. బాల్‌రాజ్‌ విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము 3న రాష్ర్టవ్యాప్త ఉద్యమానికి పిలుపు ఇచ్చామని తెలిపారు.

Leave a Reply

free website analytics