బాబ్లీని ఆపుతామని హామీ ఇస్తే ఉప ఎన్నికల బరి నుంచి వైదొలగుతాం – చంద్రబాబు సవాల్

తెలంగాణ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే తాము బాబ్లీపై ఆందోళన చేపట్టామని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలపై టీడీపీ దీటుగా స్పందించింది. బాబ్లీ ప్రాజెక్టును ఆపుతామని ప్రధాని ప్రకటిస్తే చేస్తే తాము ఉపఎన్నికల బరినుంచి వైదొలగుతామని ఆ పార్టీ ప్రకటించింది. రిమాండ్‌లో ఉన్న టీడీపీ ప్రతినిధులు చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సమావేశమై ఈ మేరకు తీర్మానించారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 23న అఖిలపక్షం ప్రధానిని కలుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకొనేందుకు ప్రస్తుత యాత్ర తలపెట్టామని, దీనిని ప్రారంభించే ముందు అన్నిపార్టీలనూ ఆహ్వానించామని సమావేశం తెలిపింది. సీఎం సహా ఏ కాంగ్రెస్ నాయకుడైనా ఈ లక్ష్యం సాధించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.
- భావోద్వేగానికి గురైన చంద్రబాబు- ఈ నెల 26 వరకూ కస్టడీ పొడగింపు – చెప్పకుండానే బస్ ఎక్కించిన పోలీసులు – మమ్మల్ని పశువుల్లా చూస్తున్నారు.. – ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పాలని డిమాండ్
- మేజిస్ట్రేట్ తీర్పు కాపీ కోసం పట్టు – బస్సు దిగి.. నేలపై పడుకొని నిరసన – పోలీసుల వైఖరితో మహిళా నేతల కంట తడి
- అరెస్టులపై వేదనతో 25 మంది మృతి – సరిహద్దుల్లో హరికృష్ణ అరెస్ట్
బాబ్లీ ప్రాజెక్టును చూడనిదే తిరిగి వెనక్కు వెళ్లేది లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బెయిల్ తీసుకుని వెళ్లిపోవాలన్న మేజిస్ట్రేట్ విజ్ఞప్తిని నిరాకరించిన చంద్రబాబు.. జైలుకు వెళ్లేందుకే మొగ్గు చూపారు. దీంతో.. టీడీపీ నేతల జ్యుడీషియల్ కస్టడీని.. ఈ నెల 26 వరకూ పొడిగిస్తూ మేజిస్ట్రేట్ ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.

అయితే.. పొద్దుపోయిన తర్వాత తమను ఔరంగాబాద్ తరలించేందుకు చేసిన ఏర్పాట్లపై చంద్రబాబు నిప్పులుగక్కారు. తమను ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ అధినేత… మేజిస్ట్రేట్ తీర్పు కాపీని తమకు చూపాలని పట్టుబట్టారు. పశువులకన్నా హీనంగా చూస్తున్నారంటూ నాందేడ్ పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు తమను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సులు దారుణంగా ఉండటంతో ఆగ్రహానికి గురయ్యారు. ఎక్కిన బస్సు నుంచి కిందకు దిగి.. నేలపై పడుకొని నిరసన తెలిపారు. మహారాష్ట్ర పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఉదయం నుంచి నిరాహార దీక్షలో ఉన్న మా పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని నిలదీశారు. ఈ ఆందోళన నేపథ్యంలో సోమవారం రాత్రికి ఐటీఐ భవనంలోనే టీడీపీ నేతలను ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

పోలీసుల వైఖరితో మహిళా ఎమ్మెల్యేలు కంట తడిపెట్టారు. మొత్తంగా.. బాబ్లీ బరిలో చంద్రబాబే గురిగా మహారాష్ట్ర సర్కారు దాదాగిరి చేసింది. రెండు రోజలుగా ఆహారం, తాగునీరు సరిపడక.. పలువురు నేతలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అయినా మహారాష్ట్ర పోలీసులు కనీస వైద్య సదుపాయాలు కల్పించలేదు. అస్వస్థతతోనే నిరాహారదీక్షలో కూర్చుండటంతో.. పలువురు నేతలు సొమ్మసిల్లిపోయారు. చంద్రబాబు సైతం నీరసించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చిన వైద్య బృందం వారికి చికిత్స అందించింది.
మరోవైపు రాష్ట్రంలో టీడీపీ పిలుపు మేరకు హర్తాళ్ ప్రశాంతంగా ముగిసింది. పలు చోట్ల ఆందోళనకు దిగిన టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు.. వారి పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న వైఖరితో వేదనకు గురై 25 మంది మరణించారు. వీరిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా.. కొందరు గుండె ఆగి చనిపోయారు. కలత చెందవద్దని ఓ ప్రకటనలో పిలుపునిచ్చిన చంద్రబాబు… రాష్ట్ర ప్రజల సాగునీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర సరిహద్దుల్లో మహా పోలీసుల జులుం ఆగలేదు. సరిహద్దుల వద్ద సోమవారం కూడా యుద్ధ వాతావరణం కనిపించింది. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన మహా పోలీసులు… ధర్మాబాద్‌లో టీడీపీ తలపెట్టిన మహా ధర్నాను విఫలం చేశారు. చంద్రబాబును కలిసేందుకు ధర్మాబాద్ వెళ్లే ప్రయత్నం చేసిన టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణను ఆంధ్ర పోలీసులు అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు.
అటు.. బాబ్లీ వ్యతిరేక ఉద్యమానికి జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు కూడగట్టేందుకు టీడీపీ నేతలు హస్తినకు చేరుకున్నారు. వివిధ విపక్ష నేతలను కలుసుకుని.. సంఘీభావం పొందారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు, ఇతర నేతలకు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆందోళనలను కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. రిలే దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తన శ్రేణులకు పిలుపునిచ్చింది.
ఎన్టీఆర్ భవన్‌లో వివివి చౌదరి నేతృత్వంలో మౌన నిరాహార దీక్షలు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నిరాహారదీక్షకు మద్దతుగా రాష్ర్ట పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్యక్రమాల కమిటీ ఛైర్మెన్ వి.వి.వి. చౌదరి నేతృత్వంలో రాష్ర్ట పార్టీ కార్యలయ కార్యదర్శి టి.డి. జనార్ధన్, కార్యదర్శులు బొద్దులూరి వెంకటేశ్వర రావు, పోలుదాసు కృష్ణమూర్తి, శ్రీశెలైం, గీతాంజలి, కవిత, యం.డి. రసూల్, పాంధువ శ్రీను తదితరులు మౌన నిరాహార దీక్ష నిర్వహించారు. సాయంత్రం ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, కంభపాటి రామ్మోహన్, బీద రవిచంద్ర వీరికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.





