‘బ్రహ్మణీ’ పై బాబు భగ భగ
బ్రహ్మణీ స్టీల్స్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ నిప్పులుకక్కారు. అసెంబ్లీలో బుధవారం చంద్రబాబు బ్రహ్మణీ స్టీల్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీపైనా మండిపడ్డారు. దీంతో అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేసారు. రాష్ట్రంలోని ఖనిజ వనరులను మైనింగ్ మాఫియా దోచుకుంటోందని ప్రశ్నోత్తారల సమయంలో చంద్రబాబు ఆరోపించారు. బ్రహ్మణీ స్టీల్స్ కు అక్రమంగా అనుమతిపొంది రాష్ట్రంలోని వనరులను దోపిడీ చేస్తోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతోనే బ్రహ్మణీ స్టీల్స్ ఈ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కర్ణాటకకు బ్రహ్మణీ మైనింగ్ మాఫియా విస్తరించడంతో అక్కడా కూడా ఉద్యమాలు జరుగుతున్నాయని చంద్రబాబు వివరించారు. ఈ అక్రమాల సంస్థను కాంగ్రెస్ సమర్థిస్తోందని విరుచుకుపడ్డారు. బ్రహ్మణీకి అనుమతిలిచ్చిన కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తల దించుకోవాలని బాబు తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. దీనిపై భారీ పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు నీతులు చెప్తే వినే పరిస్థితి తమకు లేదన్నారు. చంద్రబాబు చరిత్ర ఏంటో తమకు తెలుసునని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేవేందర్ గౌడ్ తదితరలతో నియమించిన కమిటీ ఏం ఒరగబెట్టిందీ తమకు తెలుసునని మండిపడ్డారు. మంత్రి కన్నా చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెకొనడంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేసారు.




