భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 7వ తేదీ వరకూ ఈ అధ్యయనోత్సవాలు జరుగుతాయని ఆలయం అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి ఆలయాన్ని, కల్యాణమండపం ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాలలో భాగంగా తొలి పది రోజులూ పగల్పత్తు, అనంతరం పది రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నెల 27న తేదీన పవిత్ర గోదావరి నదిలో శ్రీ సీతారామచంద్ర స్వామికి హంసలా అలంకరించిన తెప్పపై తెప్పోత్సవం నిర్వహిస్తారు. 28న ఉత్తర ద్వారం నుంచి భక్తులకు శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శన భాగ్యం కలిగిస్తారని ఆలయం అధికారులు తెలిపారు. కాగా, వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 28వ తేదీ వరకూ స్వామివారికి ప్రతి రోజు నిర్వహించే నిత్య కల్యాణాోత్సవాలను నిలిపివేశారు.




