భారత్‌ బ్యాంకులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

pranab12
విధి విధానాలను మార్చుకుని, వ్యాపార పరిమాణాన్ని పెంచుకోవడం ద్వారా భారత బ్యాంకులు అంతర్జాతీయస్థాయికి ఎదగాల్సి ఉందని, దాంతోపాటే సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ కోరారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 105వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రణబ్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.దేశపురోగతిలో ఆర్థిక సేవలు కీలక పాత్ర పోషిస్తాయని, అంతర్జాతీయ బ్యాంకింగ్‌ పరిధి ఇటీవల కాలంలో బాగా పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని భారత్‌ బ్యాంకులు తమదైన ముద్రను గ్లోబల్‌ బ్యాంకింగ్‌ స్థాయికి తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్‌ మాత్రమే ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో 282వ స్థానాన్ని సంపాదించుకోగలిగిందని, పెరుగుతున్న స్థూల జాతీయోత్పత్తితో భారత్‌ రికవరీ బాటలో నడుస్తోందని, అధిక రుణ వృద్ధిని సాధించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా బాగా పనిచేస్తున్నాయని కితాబుని చ్చారు. గత మూడు సంవత్సరాల తరువాత ఈ ఏడాది తొలి త్రైమాసి కంలో జిడిపి 8.8 శాతం చేరుకున్నందున బ్యాంకులు రెట్టించిన ఉత్సాహంతో కార్యకలాపాలు సాగించాలని, ప్రతి రెండువేల మంది జనాభాకు బ్యాంకింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యాన్ని 2012 లోగానే పూర్తి చేయాలని కోరారు.  ఈ విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంతో పురోగమిస్తున్నదని 2011 నాటికే లక్ష్యాన్ని చేరుకోగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. 105 వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 105 శాఖలు, 105 ఏటిఎంలను మంగళవారం ప్రారంభించింది. దాంతో పాటు ఖాతాదారుల కోసం ప్రీ పెయిడ్‌ గిఫ్ట్‌ కార్డు, ప్లాటినం డెబిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది.బ్యాంక్‌ సిఎండి అలోక్‌ కె మిశ్రా మాట్లాడుతూ 7000 గ్రామాలకు సంబంధించి 1.25 కోట్ల నోఫ్రిల్‌ ఖాతాలను ప్రారంభించాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలలో 22 శాతం, డిపాజిట్లలో 20-21 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

free website analytics