భారీ జన ప్రదర్శనతో మొదలైన ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర

పార్టీ అధిష్ఠానం మాటను బేఖాతరు చేస్తూ షరామామూలుగానే ధిక్కార ధోరణిలో కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఓదార్పు యాత్రను ప్రారంభిం చారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా ఐదుగురు శాసనసభ్యులు, ఇద్దరు శాసనమండలి సభ్యులు జగన్‌తో పాటు ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు. అట్టహాసంగా ప్రారంభమైన ఓదార్పు యాత్రలో అకస్మాత్తుగా విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓదార్పు యాత్ర కొనసాగిస్తున్న జగన్‌ను చూసేందుకు గిద్దలూరులో ఓ భవనంపై ఎక్కి కూర్చున్న కొందరికి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఒక యువకుడు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. నిర్ధారిత సమయంకన్నా గంట ఆలస్యంగా జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర రెండువారాల
పాటు కొనసాగుతుంది. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించి గిద్దలూరులోని రాచర్ల గేట్ సెంటర్‌లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజల మనస్సుల్లో తన తండ్రి వైఎస్ చెరగని ముద్ర వేశారనీ, లక్షల సంఖ్యలో తనకు కుటుంబసభ్యులను అప్పగించి వెళ్లిపోయారని, ఆయన మృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఆసరాగా నిలబడడం, వారిని ఓదార్చడం తన ధర్మంగా భావించానని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ నేటికి ప్రజల గుండెల్లో చెక్కు చెదరకుండా ఉన్నారనీ, వారి గుండె చప్పుడులో ఆయన మాటలు వినబడుతుంటాయని జగన్ అన్నారు. పేదల పక్షపాతిగా దేశమంతటా పేరు సంపాదించుకున్న వైఎస్ అమలు చేసిన అనేకపథకాలు ఇవాళ పెక్కు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయని ఆయన చెప్పారు. జిల్లాలోని పలువురు సీనియర్ నేతలు ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నప్పటికీ, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాపరిషత్ ఛైర్ పర్సన్ కాటం అరుణమ్మ, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి వర్గం ఓదార్పు యాత్రకు దూరంగా ఉండడం విశేషం.




