మద్యం సిండికేట్లపై మళ్లీ ఎసిబి దాడులు

ఎక్సైజ్ అధికారుల ఇళ్లలో సోదాలు
ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, వరంగల్ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) శుక్రవారం దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలతోపాటు కొందరు ఎక్సైజ్ అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. నెల్లూరు, కర్నూలు, ఒంగోలుకు చెందిన ఎసిబి అధికారులు బృందాలుగా ఏర్పడి ఒంగోలు, శింగరాయకొండలలో మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారు. ఒంగోలులోని మద్యం సిండికేట్ నిర్వాహకుడు అబ్బూరి వెంకట్రావు ఇంటిపై అధికారులు దాడి చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శింగరాయకొండలోని ఎక్సైజ్ సిఐ గురవయ్య ఇంట్లో తెల్లవారుజామున అధికారులు తనిఖీ నిర్వహించారు. సిండికేట్లకే వడ్డీ నిమిత్తం ఆయన సుమారు రూ.20 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నెలనెలా టార్గెట్ల చెల్లింపునకు ఎక్సైజ్ అధికారులే వ్యాపారులకు వడ్డీలకు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దాడుల్లో దొరికిన పత్రాల్లో లంచాల భాగోతం వెలుగుచూసింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ దాడులు కొనసాగాయి. గుంటూరులోని లక్ష్మీపురంలో నివాసముంటున్న మద్యం వ్యాపారుల గృహాలపైనా అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ ఎసిబి డిఎస్‌పి విష్ణు, గుంటూరు సిఐ శ్రీనివాసరెడ్డి, మల్లిఖార్జునరావుల నేతృత్వంలో సుబ్బారెడ్డి, నల్లబోతు శ్రీనివాసరావులకు చెందిన ఇళ్లల్లో సోదాలు చేసి, మద్యం వ్యాపారాలకు సంబంధించిన కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఎస్.శ్రీనివాసులరెడ్డి సిండికేట్లలో కానిస్టేబుల్ నాగేశ్వర్ పేరు మీద రూ.42లక్షలు పెట్టుబడి పెట్టినట్లు రికార్డులు దొరికాయి. శ్రీనివాసుల రెడ్డి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎన్.ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరుడు. ఇదే క్రమంలో తెనాలిలోనూ మద్యం సిండికేట్ల గృహాలపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓరుగంటి ఈశ్వర్, శ్రీకాకుళం పట్టణంలోని ఎపిహెచ్‌బి కాలనీలో నివాసముంటున్న సర్కిల్ హెడ్‌కానిస్టేబుల్ మెండ అప్పన్న, విశాఖపట్టణంలో ఉన్న శ్రీకాకుళం ఎక్సైజ్ సిఐ రామకృష్ణ నివాసాల్లో ఎసిబి అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఎసిబి రాజమండ్రి రేంజ్ డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యాన ఈశ్వర్ ఇంట్లో సోదాలు
ప్రారంభించారు. విశాఖపట్నంలో జనప్రియ, గణేష్ మద్యం సిండికేట్లపై దాడులు చేశారు. సిండికేట్ కార్యాలయాలతోపాటు ఆయా సిండికేట్ల యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్, పుష్కరగణేష్ ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ సిఐ కామేశ్వరరావు ఇంటిపై కూడా దాడిచేశారు. గతంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన హనుమంతరావు ఇంటిలో రాజమండ్రి ఎసిబి అధికారులు సోదాలు చేశారు. అందరిపై కేసులు నమోదుచేశారు. విశాఖలో జరిగిన దాడుల్లో డిఎస్‌పి రామకృష్ణప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల ఇళ్లపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హన్మకొండలోని మద్యం వ్యాపారి మోహన్‌రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లోని రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన వీరాచందర్ ఇంట్లోనూ సోదాలు చేశారు. వీరితో పాటు హన్మకొండలోని సహకార్‌నగర్‌లో ఉన్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సిఐ కరమ్‌చంద్ ఇంటిపైనా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుండి రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా అధికారులు దాడులు నిర్వహిస్తుండడంతో సమాచారం తెలుసుకున్న పలువురు మద్యం వ్యాపారులు ఉడాయించినట్లు సమాచారం. దాడులపై ఎసిబి అధికారులు ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు.




