మరాఠీలకు మానవత్వం లేదు
మరాఠీలకు మానవత్వం లేదని సాటి మనిషిపై విచక్షణా రహితంగా దాడి చేయడమే వారి నైజమని ఆదోని ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులను చూపిస్తామని చెప్పి తమను నిర్భంధించి నానాహింసలకు గురిచేశారన్నారు. కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదన్నారు. దీంతో నాలుగు రోజుల పాటు నరకయాతన
అనుభవించామన్నారు. మన ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా మరాఠ పోలీసులు తమకు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను కూడా పిడిగిద్దులు గుద్దారన్నారు. ఆంధ్రా పోలీసుల్లో ఉన్న బాస్‌యిజం మహారాష్ట్ర పోలీసుల్లో లేదని, ఎస్పీ వచ్చినా సామాన్య పోలీసులు సెల్యూట్ చేయడం లేదన్నారు. నాలుగు రోజుల పాటు సరైన భోజన సౌకర్యాలు లేకపోవడంతో అనారోగ్యాలకు గురయ్యామన్నారు. కనీసం వైద్య సౌకర్యం కూడా కల్పించలేదని, తమకు వైద్యం అందించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులపై కూడా మరాఠి పోలీసులు లాఠి ఛార్జీ చేశారన్నారు. చంద్రబాబు తప్ప మిగతా అందరూ లాఠి దెబ్బలు తిన్నామన్నారు. రాష్ట్ర స్వప్రయోజనాల కోసం మహారాష్టల్రో రాజకీయ పార్టీలన్ని ఒకే తాటిపైకి వచ్చి పోరాడుతున్నాయన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లి కష్టాలు పాలైన సమయంలో మద్దతు ఇవ్వాల్సింది పోయి విమర్శలు చేయడం మన నేతలకు తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడాలని ఆయన కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు మల్లేష్‌గౌడు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.




