మరో విద్యార్థి ఆత్మార్పణం

అసెంబ్లీ వరకు అంతిమయాత్రకు విద్యార్థుల పట్టు
పోలీసుల లాఠీఛార్జి.. 30 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
రణరంగమైన గాంధీ ఆసుపత్రి ప్రాంగణం
షరతులతో శవయాత్రకు ఓకే
అనుమతించిన మానవ హక్కుల కమిషన్
తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మార్పణ చేసుకున్నాడు. నా ప్రాణాలు తెలంగాణకు అంకితమిస్తున్నా.. దగాకోరు రాజకీయ నాయకులను నమ్మకండి. యువతసారథ్యంలో తెలంగాణను సాధించండి.. అసెంబ్లీ వరకు నా కడపటి యాత్రను జరపండి.. అంటూ లేఖ రాసి పెట్టి ఓయూలో కెమికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థి సాయికుమార్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదం ఓయూలో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. సాయికుమార్ కడపటి కోరిక మేరకు.. అసెంబ్లీ వద్దకు ఆయన మృతదేహాన్ని విద్యార్థులు తీసుకెళ్లే ప్రయత్నంలో గాంధీ ఆసుపత్రి రణరంగమైంది. పోలీసుల లాఠీచార్జిలో 30 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంతిమయాత్రను అసెంబ్లీ వరకు అనుమతిస్తూ.. మానవహక్కుల కమిషన్ షరతులతో కూడిన అనుమతినిచ్చింది.
ఇంటికి వెళుతున్నానని చెప్పి…
నల్లగొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన లింగయ్యయాదవ్, లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సాయికుమార్. లక్ష్మి ప్రైవేటుస్కూల్లో అటెండర్ కాగా, లింగయ్య వ్యవసాయం చేస్తున్నారు. సాయికుమార్ ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ మినీ టెక్నాలజీ హాస్టల్ రూం నెం.108లో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తోటి విద్యార్థులు క్లాసులకు వెళ్తూ సాయికుమార్‌ను రమ్మన్నారు. తాను ఇంటికి వెళుతున్నానని చెప్పి రూంలోనే ఉండిపోయాడు.
క్లాసులకు వెళ్లినవారు తిరిగి వచ్చేసరికే.. సాయికుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు కొనప్రాణాలతో ఉన్న సాయికుమార్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు పోయాయి. ఈవిషయం తెలుసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. అదే సమయంలో వీసీ తిరుపతిరావు గాంధీ ఆసుపత్రికిరాగా.. విద్యార్థులు ఆయనను అడ్డుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం జరిపించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించారు. విద్యార్థి ఆఖరు కోరిక మేరకు అసెంబ్లీ వరకు అంతిమయాత్ర జరుపుతామని మృతదేహంతో సహా క్యాజువాలిటీ వార్డు వద్దే బైఠాయించారు. ఇంతలోనే.. కోదండరాం అక్కడికి చేరుకుని శాంతియుతంగా శవయాత్ర జరిపే హక్కు కూడా లేదా? అంటూ పోలీసులను నిలదీశారు. ఆ సమయంలోనే కొందరు విద్యార్థులు మృతదేహాన్ని ఆస్పత్రి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జి చేయగా 30మందికి గాయాలయ్యాయి. లా విద్యార్థి విజయ్‌కుమార్ కుప్పకూలిపోయారు.
ఇంతలో.. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, పద్మారావులతోపాటు జగదీశ్వర్‌రెడ్డి తదితరులు చేరుకుని పోలీసులను అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. మంగళవారం రాత్రి వరకు విద్యార్థులు ఆందోళనను కొనసాగించారు. తెలంగాణ కోసం వందలాదిమంది విద్యార్థులు ఆత్మార్పణలు చేసుకుంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయంటూ మాజీ మావోయిస్టు సాంబశివుడు మండిపడ్డారు.
సాయికుమార్.. క్లాస్ టాపర్
సాయికుమార్ చదువుల్లో మొదటి నుంచీ టాపరే. ఇంటర్మీడియెట్‌లో 965 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత ఎంసెట్‌లో ర్యాంక్ సాధించి ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీస్‌లో కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో, చదువుకుంటూనే.. ట్యూషన్లు చెప్పేవాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాలుపంచు కుంటున్న సాయికుమార్ ఇలా చేస్తాడని తాము ఊహించలేకపోయామంటూ వారు కన్నీరుమున్నీరయ్యారు. సాయికుమార్ మరణంతో కోదాడ శోకసంద్రమైంది. సొంత ఊరు కాపుగల్లు అయినా.. సాయి చిన్నప్పటినుంచీ కోదాడ యాదవనగర్‌లోని అమ్మమ్మ ఇంటి వద్దే ఉండి చదువుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ఊరడించడం ఎవరివల్లా కావడం లేదు. సోమవారం రాత్రి ఫోన్ చేసి ‘అమ్మమ్మా రేపు నేను కోదాడకు వస్తున్నాను’ అని చెప్పిన మనవడు కానరాని లోకాలకు వెళ్లాడంటే నమ్మలేకపోతున్నానంటూ సాయికుమార్ అమ్మమ్మ గురవమ్మ కన్నీరుమున్నీరైంది.
ఆఖరి కోరికను మన్నించిన హక్కుల కమిషన్
తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసిన సాయికుమార్ ఆఖరి కోరికను మానవ హక్కుల కమిషన్ మన్నించింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వరకు సాయికుమార్ అంతిమయాత్రను అనుమతించింది. అయితే.. బుధవారం తెల్లవారు జామున మూడుగంటలలోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఊరేగింపులో యాభైమందే పాల్గొనాలని షరతులు విధించింది.




