మహారాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి – నన్నపనేని

కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోగాలం వచ్చింది. పాపం పండింది. మ నాయకుడు చంద్రబాబు నాయుడుని మానసికంగా హింసిస్తున్నారు. ఆయనను బస్సులోకి ఎత్తిపడేశారు. దెబ్బలు తగిలి ఉంటాయి. మహిళా ప్రజాప్రతినిధుల చీరలు కూడా చినిగాయని చెబుతున్నారు. నాయకులకు లాఠీ దెబ్బలు తగిలాయి.. వీటిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చోద్యం చూస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి.
రాష్ట్ర హోమ్ మంత్రి సబితను తప్పించాలి. కేవలం వైఎస్ అభిమానిగానే ఆమెకు హోమ్‌మంత్రి పదవి దక్కింది.. మంగళవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, 74 మంది ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా మహరాష్ట్ర పోలీసులు చేసిన దాష్టీకం పట్ల యావత్ తెలుగుజాతి ఆగ్రహంతో ఉంది. మొత్తం తెలుగుజాతికి జరిగిన అవమానమిది. ఇది క్షమించరానిది. మహరాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టపర్తికి వస్తే తరిమి కొట్టాలి. రాళ్ళతో దాడి చేయాలి. తెలుగుపౌరుషం, ఆత్మగౌరవం ఏమిటో అశోక్‌చవాన్‌కు చూపించాలి.. అంటూ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆవేదనతో అన్నారు.
విజయవాడలోని కృష్ణాజిల్లా టీడీపీ కార్యాలయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మంగళవారం ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ పలుమార్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు. మహిళలుగా వారి ఇబ్బందులు చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోకుండా అక్కడి పోలీసులు అవమానపరిచారన్నారు. రాష్ట్ర హోమ్ మంత్రి సబిత, కేంద్రంలో సోనియా, రాష్ట్రపతి ప్రతిభ, స్పీకర్ మీరా అందరూ మహిళలు అయి ఉండి ఈ సంఘటనల పట్ల కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. మానవహక్కుల కమిషన్ కూడా వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రగవర్నర్, ముఖ్యమంత్రి రోశయ్య ఏం మాట్లాడుకున్నారు? గవర్నర్ తన విచక్షణాధికారాన్ని వినియోగించి చర్యలు తీసుకోలేరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాటకమాడుతోందని విమర్శించారు. తెలుగుజాతి చరిత్రలో మంగళవారం బ్లాక్‌డేగా నిలుస్తుందన్నారు. మహరాష్ట్రలో ఝాన్సీ రాణి పుట్టింది, అక్కడ పవిత్ర షిర్డీ క్షేత్రం ఉంది, మన తెలుగువారు కూడా అక్కడ ఉన్నారు.
ఇదేనా ఆ రాష్ట్ర ప్రభుత్వ మర్యాద అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోశయ్య సోనియమ్మ చెబితేనేగాని ఏదీ చేయడు. ఇంత చచ్చు పరిపాలనను ఎప్పుడూ చూడలేదంటూ ఆమె తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇలా అవమానం జరిగితే ఊరుకుంటారా? బాబ్లీ పోరాటం రాజకీయ పోరాటం కాదు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగానే కాదు, ఇతర ర్రాష్టాల వారు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు. దీనికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.




