మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు – మమత

mamta_vid_27మహిళా బిల్లుపై తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్వరంలో మళ్ళీ మార్పు వచ్చింది. బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని మమత తాజాగా ప్రకటించారు. కేవలం కమ్యునికేషన్ గ్యాప్ వల్లనే రాజ్యసభలో తమ పార్టీకి ఉన్న ఇద్దరు సభ్యులు మహిళా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయలేకపోయారని ఆమె వింతైన వివరణ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో తాము ఇంతకు ముందు నిర్ణయానికే కట్టుబడి వున్నామని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆమె స్పష్టం చేశారు. లాలు, ములాయంను తాను కలిసినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. లోక్‌సభ సమావేశ మందిరంలోకి వెళుతూ మమత విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా బిల్లు పట్ల తమ పార్టీ స్టాండర్డ్ మారిందంటూ మీడియాలో ఊహాజనిత కథనాలు వెలువడ్డాయని మమత వాక్రుచ్చారు. మహిళా రిజర్వేషన్లలో మైనార్టీలకు కోటా ఇవ్వాలన్న డిమాండ్‌పై ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో తాము వేచిచూశామని, అయితే తర్వాత తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో తమ సభ్యులు పాల్గొనలేకపోయారని మమతా బెనర్జీ వివరించారు.

Leave a Reply

free website analytics