మీరు వద్దంటారు వాళ్లు కావాలంటారు నేనేం చేయాలి? మంత్రులకు సీఎం ప్రశ్న

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడం కుదరదని ముఖ్యమంత్రి రోశయ్య తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు ఆగ్రహావేశాలతో ఉన్నారని, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పరీక్షను వాయిదా వేయాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీకే అరుణ, రామిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ముఖ్యమంత్రిని కోరారు. “ఈ పరీక్ష ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గేంతవరకూ వాయిదా వేయడంలో తప్పేముంది!’ అని దుద్దిళ్ల ముఖ్యమంత్రితో అన్నారు. ఈ సమయంలో డీకే అరుణ జోక్యం చేసుకున్నారు. “శాంతి భద్రతల సమస్య తలెత్తితే చాలా కష్టం. జరగరానిది జరిగితే పిల్లలు నష్టపోతారు. ఇలాంటి కల్లోల వాతావరణంలో విద్యార్థులు పరీక్ష సరిగా రాయలేరు. స్వయం ప్రతిపత్తి పేరిట ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామి రెడ్డి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన వైఖరి వల్లే ఇదంతా జరుగుతోంది. గతంలో పరీక్షను ఎందుకు వాయిదా వేశారో చెప్పలేదు.
ఇప్పుడు శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ .. వాయిదా వేసేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇదేం విధానం?’ అని డీకే అరుణ ప్రశ్నించారు. మంత్రుల ప్రశ్నలకు రోశయ్య తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘వాళ్లేమో (సీమాంధ్ర) పరీక్ష జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. మీరేమో (తెలంగాణ) వాయిదా వేయాలంటున్నారు. ఇక్కడి పిల్లలు గోడలెక్కి ప్రాణత్యాగం చేసుకుంటామంటున్నారు. పరీక్షలు వాయిదా వేస్తే అక్కడి పిల్లలు చస్తారని అంటున్నారు. దీనివల్ల టెన్షన్ పెరుగుతోంది. నేనేం చేయాలి? పిల్లలకు ఏమైనా జరిగితే వారి తల్లిదండ్రులు ఎంత క్షోభిస్తారు? ఏపీపీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. పోస్టుల భర్తీపై సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దానినెలా ఆపగలం? ఇంత వరకూ వచ్చాక పరీక్ష వాయిదా వేస్తే ఎలా? ఉద్యోగం కోసం ప్రిపేర్ అయిన వాళ్లుంటారు. రాత్రనక పగలనక కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు.ఈ ఆఖరి నిమిషంలో వాయిదా వేయాలా?’ అని రోశయ్య ప్రశ్నించారు. దీంతో..ఈ ఉద్రిక్తతలు తగ్గేంత వరకు కనీసం తెలంగాణలోనైనా పరీక్ష వాయిదా వేయాలని వారు కోరారు. శాంతి భద్రతల సమస్య తలెత్తి పరీక్ష వాయిదా పడితే… ఆ క్రెడిట్ టీఆర్ఎస్‌కు పోతుందని, అలా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సీఎంకు చెప్పి బయటికి వచ్చేశారు. అక్కడ వీరికి డీజీపీ అరవిందరావు కనిపించారు. ఆయనతో కూడా మంత్రులు దీనిపై చర్చించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తిన తర్వాత పరీక్ష వాయిదా వేయడం కంటే ముందుగానే వేయడం మంచిదని చెప్పారు.




