మీ అండఉండగా ఒంటరినెలా అవుతా – జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, కడప ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పత్రికలపై విరుచుకుపడ్డారు. తానంటే గిట్టని కొన్ని పత్రికలు ఏవేవో రాస్తున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర సోమవారం నాలుగోరోజుకు చేరింది. వెలిగండ్ల, పామూరు, పిసి పల్లి, కనిగిరి మండలాల్లో సాగిన ఆయన యాత్రకు జనం భారీగా వచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆయన మాట్లాడుతూ తన తండ్రిపై కోపం పెంచుకున్న కొన్ని పత్రికలు ఆయన చనిపోయిన తరువాత తనపైనా అవాస్తవాలు రాస్తున్నాయన్నారు. తానెప్పుడూ ఒంటరిని కాదన్నారు. ఎమ్మెల్యేలు రాకున్నా జనం తన వెంట వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా ఏం జరుగుతోందో ప్రజలకు తెలుసునన్నారు. తన తండ్రి దుర్మరణం తరువాత తనకు కొండంత అండ పోయిందని, తాను ఒంటరినయ్యానంటూ తానంటే గిట్టని, నచ్చనివారు, కొన్ని పత్రికలు రోజు రాస్తూనే ఉన్నాయన్నారు. తన తండ్రి దివంగత వైఎస్ తరహాలోనే జగన్ కూడా పత్రికలపై విరుచుకు పడ్డారు. ఓదార్పు యాత్రలో మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనక పోయినా ప్రజలు తనవెంట ఉన్నారని స్పష్టం చేశారు. ఇది ఇలాఉంటే వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణ వార్త విని మృతిచెందిన పిసిపల్లి మండలం మిట్టమీదపల్లిలోని కరణం పెదవెంకట సుబ్బయ్య కుటుంబాన్ని జగన్ సోమవారం ఓదార్చారు. ఈ యాత్రలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. కనిగిరి నియోజకవర్గంలో యాత్ర జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాత్రం దూరంగానే ఉన్నారు.
ఓదార్పు యాత్ర ఆగదు : మంత్రి బాలినేని స్పష్టం
ఎన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినా వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర ఆగదని, తాను కూడా వెన్నంటే ఉంటానని రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన జగన్ కూడా మాట మీద నిలబడే మనిషన్నారు. వైఎస్ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనన్నారు.
నెల్లూరులో ఓదార్పుకు సన్నాహాలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర కోసం ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో యాత్ర నిర్వహణ బాధ్యతలు సర్వం తానై చూసిన దివంగత వైఎస్ తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి సోమవారం నెల్లూరులో స్థానిక ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి నివాసానికి వచ్చి చర్చలు జరిపారు. టిటిడి మాజీ చైర్మన్, పిసిసి ప్రధాన కార్యదర్శి భూమన్ కరుణాకరరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరైన ఈ చర్చలో ఓదార్పు యాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ఓదార్పు యాత్రకు తుదిరూపు ఇవ్వడానికి ఎంపి మేకపాటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, వైఎస్, జగన్ అభిమానులతో జిల్లా స్థాయిలో మంగళవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంపి మేకపాటి మాట్లాడుతూ జిల్లాలో 300లకు పైగా వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేదన్నారు.
వైఎస్ విగ్రహ ఏర్పాటుపై హైడ్రామా
నెల్లూరు నగరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. ఆనం సోదరులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాజీవ్ గాంధీ భవన్ నేతలు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా అనుమతి లేదంటూ కార్పొరేషన్ అధికారులు, పోలీసు బలగాలతో వచ్చి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్తత అనంతరం విగ్రహ శంకుస్థాపనకు కలెక్టర్ అనుమతించారు. అంతకుముందు నెల్లూరు ఆర్డీవో వేణుగోపాలరెడ్డి, డిఎస్పీ రాధిక రాజీవ్ భవన్ నేతలతో చర్చించారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో కలెక్టర్, ఎస్పీ సూచన మేరకు పూజలు చేసుకుని పనులు ప్రారంభించుకోవచ్చని ఆమరణ దీక్షకు పూనుకున్న కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డికి పోలీసు అధికారులు వౌఖికంగా చెప్పారు. వౌఖికంగానైనా అనుమతి రావడంతో కోటంరెడ్డి అధికారలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.




