ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం – రేపే 12 నియోజకవర్గాల్లో పోలింగ్

ఉప ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మైక్‌లు, మాటలు బంద్ అయ్యాయి. పార్టీలన్నీ ‘మాటలు’ కట్టిపెట్టి… ‘చేతల్లోకి’ దిగాయి. డబ్బు మూటలు, మద్యం సీసాలు తెరుచుకుంటున్నాయి. తెలంగాణలో 12 నియోజకవర్గాల్లో ఆదివారంతో ప్రచారం ముగిసింది. మంగళవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం దాకా మద్యం, మనీ పంపిణీ చేయటానికి పలువురు నేతలు సన్నాహాలు చేసుకున్నారు. ఏదోవిధంగా ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గుత్తగా వివిధ సంఘాల ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో యువత కీలకపాత్ర పోషించనుందనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులంతా వారిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. యువజన సంఘాల నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. హామీలు గుప్పిస్తున్నారు. “ఈ 36 గంటలే కీలకం. దీనిని సమర్థంగా వినియోగించుకున్న వారిదే పైచేయి. ఫలితాలను తారుమారు చేసే సత్తా కూడా ఈ సమయానికే ఉంటుంది” అని గడిచిన 20 ఏళ్లుగా ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే… సెంటిమెంట్ ముందు ఇలాంటి ప్రలోభాలు పని చేయవని, ఈ విషయం గతంలో రుజువైందని టీఆర్ఎస్ ముఖ్య నేత ఒకరు అన్నారు. “ప్రలోభాలు, సెంటిమెంట్ ఎంతగా ఉన్నా.. పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఎక్కడికీ పోదు. గత అనుభవాలు చెబుతున్నది ఇదే” అని టీడీపీ తెలంగాణ సీనియర్ ఒకరు చెప్పారు. పైకి ఏం చెబుతున్నా… దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వానానికి భారీగానే తెరలేచింది. అత్యధికంగా ఐదు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్ జిల్లాలో బెల్ట్‌షాపుల ద్వారానేకాక… పార్టీ నాయకులు స్వయంగా మద్యం పంపిణీ చేపట్టారు. మహిళా సంఘాలు, కులసంఘాలు, యువజన సంఘాలకు డబ్బులు ఎర వేస్తున్నారు.
ఒక్కో మహిళా సంఘానికి రూ.10వేల చొప్పున ఇస్తుండగా… కుల సంఘాల వారికి అడిగినంత అందిస్తున్నారు. మూడు రోజులుగా పలుగ్రామాల్లో ‘పంపిణీ హడావుడి’ స్పష్టంగా కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో ఆదివారం పోలీసులు ముగ్గురు స్థానిక టీడీపీ నేతల నుంచి రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మెట్‌పల్లిలోని హనుమాన్‌నగర్‌లో ఇంటింటికీ తిరుగుతూ డబ్బు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్న వీరి నుంచి డబ్బుతోపాటు కరపత్రాలు, ఓటరు లిస్టులను స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసి.. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ పశ్చిమ పరిధిలోని హన్మకొండ వికాస్ నగర్‌లో డబ్బు పంపిణీ చేస్తున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.40వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డబ్బు, మద్యం సరఫరా చేసే బాధ్యతను పార్టీల నేతలు డివిజన్ స్థాయి ప్రచార ఇన్‌చార్జిలకు, నాయకులకు అప్పగించారు. ఆదివారం రాత్రి నుంచి ఆయా వార్డుల్లో రహస్యంగా సిట్టింగ్‌లు వేసి పంపిణీ పని చేపట్టారు. పురుషులకు డబ్బు, మద్యం అందిస్తుండగా… మహిళలకు చీరెలు, జాకెట్ పీసులు, వెండి కుంకుమ భరిణెలు పంచుతున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం అర్ధరాత్రి నుంచి మద్యం, మనీ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ బరిలో నిలిచిన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మద్యం, ధన ప్రవాహానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక అభ్యర్థి రాత్రికి రాత్రి రూ.2 కోట్లు పంపిణీ చేసేందుకు వీలుగా… గ్రామ సంఘాల నేతలతోపాటు ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులకు చేరవేసినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలోని లక్సెట్టిపేటలో 780 మద్యం క్వార్టర్ సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో నేతలు క్షణం తీరిక లేకుండా ఓటర్ల చుట్టూ తిరిగారు. కొన్నిచోట్ల భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు. గొడుగులు పట్టుకుని ప్రదర్శనలు, పాదయాత్రలు చేశారు. కుండపోత కారణంగా ఆదివారం మంచిర్యాలలో జరగాల్సిన కేసీఆర్ బహిరంగ సభ రద్దయింది. శ్రీరాంపూర్‌లో సీడబ్ల్యూసీ సభ్యుడు వెంకటస్వామి (కాకా) పాల్గొనాల్సిన సభ కూడా రద్దయింది. దీంతో నేతలు పాదయాత్రలకు పరిమితమయ్యారు. పది రోజులపాటు ఏకధాటిగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.తెలంగాణ సెంటిమెంట్, గ్రామాల్లో లభిస్తున్న స్వచ్ఛంద మద్దతు, జేఏసీ అండదండలతో ఘన విజయం తథ్యమని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. మరో నాలుగేళ్లు అధికారం తమ చేతుల్లోనే ఉంటుందని, అభివృద్ధి తమతోనే సాధ్యమని, తెలంగాణ ఇచ్చేది తామేనని చెబుతూ కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బాబ్లీతో సహా వివిధ సమస్యలపై చేసిన పోరును టీడీపీ అభ్యర్థులు ఏకరువు పెట్టారు. సంస్థాగతంగా బలం ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి పోటీచేస్తున్న ఒకే ఒక్క స్థానం నిజామాబాద్ అర్బన్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. టీఆర్ఎస్‌తో కలిసి పావులు కదుపుతోంది.
రేపు వేతనంతో కూడిన సెలవు
ఉప ఎన్నికలు జరిగే 12 నియోజక వర్గాల పరిధిలో దుకాణాలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి కార్మిక శాఖ మంగళవారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఉద్యోగులు పోలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాలెట్ భయం
ఉప ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులను వర్షం, బ్యాలెట్ భయాలు వెన్నాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల తెలంగాణ అంతా ముసురు పట్టింది. సోమవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం పోలింగ్ నాటికి వాతావరణం ఎలా ఉంటుందోననే ఆందోళన పార్టీల్లో వ్యక్తమవుతోంది. అసలే… వ్యవసాయ సీజన్, ఆపై వర్షాలు కురుస్తుండటంతో పోలింగ్ బూత్‌ల దాకా ఎంతమంది వస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. అలాగే 64మందికంటే ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉన్న ఐదు చోట్ల బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో బ్యాలెట్ పెద్దగా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఏజెంట్ల విషయంలోనూ గందరగోళం తలెత్తుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏకంగా 74 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదు వరుసల్లో, న్యూస్‌పేపర్ సైజులో ఉన్న బ్యాలెట్ పేపర్‌లో ప్రధాన పోటీ దారులను గుర్తించడం కష్టమవుతుందని… చెల్లని ఓట్లు భారీగా ఉంటాయని నేతలు చెబుతున్నారు.




