మునిసి’పోల్స్’ మేలో – సర్కారు నిర్ణయం..


ఏర్పాట్లకు సీఎం ఆదేశం
2011 జనగణన ప్రకారమే.. అన్నింటికీ ఓకే విడత పోల్స్
మార్చి ఆఖరుకు బీసీ గణన పూర్తి
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెరిగే అవకాశం: మంత్రి మహీధర్ రెడ్డి
మునిసిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మే నెలాఖరు నాటికి ఎన్నికలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ది పథకాలపై సీఎం కిరణ్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.మహీధర్‌రెడ్డి, సంబంధిత అధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మహీధర రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికలు జరపాలని ఈ సమావేశంలో సీఎం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
“రాష్ట్రంలోని మునిసిపాలిటీలకు మేలో ఎన్నికలు జరపనున్నాం. కొత్తగా ఏర్పాటైన వాటితో కలిసి అన్నింటికీ ఒకే విడత ఎన్నికలు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఎన్నికలు జరిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం” అని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పెట్టే గడువు ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. “2011 జనాభా గణన ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ ప్రకారమే రిజర్వేషన్లు వర్తింప చేస్తాం. తద్వారా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా ఉన్న రిజర్వేషన్లు (దామాషా ప్రకారం) లభించి.. వారికి తగు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుంది” అని చెప్పారు.  ఇక.. కొత్తగా ఏర్పాటు చేసిన 42 మునిసిపాలిటీల్లో బీసీ ఓటర్ల గణనను శనివారం నుంచి తాము ప్రారంభిస్తున్నామన్నారు. మార్చి ఆఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఇప్పటికే ఉన్న 125 మునిసిపాలిటీలు/కార్పోరేషన్‌లకు అదనంగా 42 కొత్తగా ఏర్పాటయ్యాయని, మరో మూడునాలుగు కొత్త మునిసిపాలిటీలను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర పథకం జవహర్‌లాల్‌నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జెఎన్ఎన్‌యు ఆర్ఎం) నిధులతో చేపట్టిన అన్ని పనులను మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.
మునిసిపల్ నిధుల వినియోగంపై గల ఆంక్షలను ఎత్తి వేసి రూ.250 కోట్లను విడుదల చేస్తున్నామని, ఇక ముందు ఎలాంటి ఆంక్షలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. కొత్త మునిసిపాలిటీల్లోనూ కనీసం 20 మంది సిబ్బంది ఉండేలా ఆర్థిక శాఖ అనుమతి కోరామని తెలిపారు. నిజానికి.. రాష్ట్రంలోని మునిసిపాలిటీలు 2010 సెప్టెంబర్ 30 నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.
ప్రస్తుత విధానంలోనే!!
మునిసిపల్ ఎన్నికలను పార్టీల గుర్తులపైనే నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వారివారి జానాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఇక బీసీలకు మూడో వంతు రిజర్వేషన్లు కేటాయిస్తారు. అన్ని కేటగిరీలలో గతంలో మూడో వంతుగా ఉన్న మహిళా రిజర్వేషన్లను ఈసారి 50 శాతానికి పెంచారు.  కాగా మేయర్/ చైర్మన్ పదవులకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలా? పరోక్షంగానా? అన్న విషయమై తర్జనభర్జన పడి ఎట్టకేలకు ప్రస్తుతమున్న పరోక్ష విధానం వైపే సర్కారు మొగ్గు చూపినట్లు సమాచారం. కొత ్త మునిసిపాలిటీల ప్రక్రియకు వారం రోజుల్లో తెరపడనుంది. కొన్ని మునిసి పాలిటీల్లో సమీప గ్రామాల విలీనం, మునిసిపాలిటీల స్థాయి పెంపు ప్రతిపాదనలన్నింటినీ త్వరలోనే పరిష్కరించి కొలిక్కి తెస్తారు. తద్వారా రాష్ట్రంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల మొత్తం సంఖ్య 170కి చేరుకోనుంది.

Leave a Reply

free website analytics