మూడు నగరాలకు ముప్పు’
దేశంలోని మూడు నగరాలకు తీవ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంమంత్రత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోల్ కత్తా, ముంబయి,. బెంగళూరు నగరాలపై తీవ్రవాదులు ఏ సమయంలోనైనా విరుచుకుపడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసి అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ సూచించింది. ముఖ్యంగా విదేశీయులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా చేపట్టాలని రాష్ట్రాలకు పంపిన ఆదేశాల్లో పేర్కొంది. ఇటీవల అహ్మదాబాద్, జైపూర్ పేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన సల్మాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ను విచారించగా హోంత్రిత్వ శాఖకు కీలక సమాచారం లభించింది. ఐఎస్ఐ సంస్థలో శిక్షణ పొందిన తీవ్రవాదులు భారత్ పై దాడులు చేసేందుకు ‘కరాచీ ప్రాజెక్టు’ పేరిట రంగంలోకి దిగుతున్నట్లు సల్మాన్ విచారణలో ధృవీకరించాడు. తీవ్రవాదులు కరాచీ, ఖట్మాండ్, దుబాయ్ లలో స్థావరాలు ఏర్పాటు చేసి దాడులకు వ్యూహం పన్నుతున్నట్లు సల్మాన్ పోలీసుల ముందు అంగీకరించాడు. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు రాష్ట్రాల్లో విదేశీయులు ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కరాచీ ప్రాజెక్టును చేపడుతున్నట్లు పోలీసులు పసిగట్టారు. కరాచీ ప్రాంతంలోని తీవ్రవాదుల శిక్షణ స్థావరానికి అమీర్ రాజా ఖాన్ కన్వీనర్ గా నేతృత్యం వహిస్తున్నాడని విచారణలో సల్మాన్ వెల్లడించాడు. అలాగే భట్కల్ సోదరులైన రియాజ్, ఇక్బాల్ లు శిక్షణా కేంద్రానికి ఇన్ ఛార్జులుగా వ్యవహరిస్తున్నారని, మరో భారతీయ యువకుడు కూడా ఉన్నాడని పోలీసులు ముందు సల్మాన్ అంగీకరించాడు.అయితే సల్మాన్ వెల్లడించిన అంశాలను పోలీసులు నిర్ధారించుకున్నారు. గతంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ కు చెందిన ఖవాజా అమ్ జద్ ను విచారించగా, సల్మాన్ చెప్పిన అంశాలు పూర్తిగా నిజమేనని ధృవీకరణ అయింది. భారత్ పై దాడులకు సంబంధించి ముజాహిద్దీన్ దళాధిపతులపై ఐఎస్ఐ- లష్కర్ కు చెందిన బాస్ ల ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోందని అమ్జద్ పోలీసులు ముందు వెల్లడించాడు. విచారణలో సల్మాన్, అమ్ జద్ లు వెల్లడించిన అంశాల ఆధారంగా అప్రమత్తం కావాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ‘తీవ్రవాదుల కదలికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అసలు సమాచారం ఉందా లేదా మాకు తెలియదు, కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం’ అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. భద్రతా బలగాలు ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ కు చెందిన కొందరు అనుమానితలను అదుపులోకి తీసుకున్నారని, త్వరలోనే మరికొందరని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు.




