మూడు రోజుల సిబిఐ కస్టడీకి సునీల్‌రెడ్డి


స్టయిలిష్‌ రంగారావుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వద్దంటూ సిబిఐ పిటిషన్‌
విజయసాయి రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ 31వ తేదీకి వాయిదా
ఏ క్షణంలోనైనా బిపి ఆచార్య అరెస్టు
ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ అవకతవకల వ్యవహారంలో అరెస్టు అయిన సునీల్‌రెడ్డిని మూడు రోజులు పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతించింది. సునీల్‌రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సిబిఐ ఇటీవల కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం కోర్టు విచారించింది. రెండు నెలలలుగా తప్పించుకు తిరుగుతున్న సునీల్‌రెడ్డి, ఎమ్మార్‌లో విల్లాలు, ప్లాట్ల అమ్మకాల్లో అక్రమంగా వసూలైన డబ్బులు ఎక్కడ దాచారో తెలుసుకునేందుకు ఆయనను తమ కస్టడికి అప్పగించాలని సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. సునీల్‌రెడ్డిని శనివారం ఉదయం కస్టడీకి తీసుకుని సోమవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి సాయింత్రం 5:30 వరకు ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించింది. సునీల్‌రెడ్డి నుండి డబ్బు పొందిన అసలు వ్యక్తిని గుర్తించాల్సిన అవసరముందని, ఆ డబ్బును ఎక్కడ దాచారో సునీల్‌రెడ్డికి తెలుసని, చార్జీషీట్‌ దాఖలకు సమయం దగ్గరపడుతున్నందున లోతుగా విచారించాల్సివుందని, అందుకే కస్టడీకి ఇమ్మని అడుగుతున్నామని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. అయితే సిబిఐ వాదనను సునీల్‌రెడ్డి తరపు న్యాయవాది సుశీల్‌కుమార్‌ తప్పుబట్టారు. ఎమ్మార్‌ కేసులో ట్రైమ్యాక్స్‌ అధినేత కోనేరు ప్రసాద్‌, స్టయిలిష్‌హోం డైరెక్టర్‌ తుమ్మల రంగారావులను కాపాడేందుకు సిబిఐ ప్రయత్నిస్తుందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే రంగారావు పేరును తొలగించారన్నారు. వారిద్దరూ సునీల్‌రెడ్డికు డబ్బులిచ్చారనడానికి ఆధారాలు లేవన్నారు. ఇదిలావుండగా, తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలంటూ నాంపల్లి సిపిఐ ప్రత్యేక కోర్టులో సునీల్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా పడింది.
ఎమ్మార్‌ కేసుకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టులో స్టయిలిష్‌ హోం డైరెక్టర్‌ తుమ్మల రంగారావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా పడింది. కాగా రంగారావుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వద్దంటూ సిబిఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఛార్జిషీటు దాఖలకు సమయం దగ్గరపడుతున్నందున రంగారావుకు ముందస్తు బెయిల్‌ ఇస్తే కేసు తారుమారయ్యే అవకాశముందంటూ పిటిషన్‌లో సిబిఐ పేర్కొన్నట్లు తెలిసింది. జగన్‌ అక్రమాస్తులు కేసులో అరెస్టు అయిన జగతి పబ్లికేషన్స్‌ వైస్‌ ఛైర్మన్‌ విజయసాయిరెడ్డి బెయిల్‌ కోసం చేసుకున్న పిటిషన్‌పై విచారణను ఈనెల 31వ తేదీకి నాంపల్లి సిబిఐ కోర్టు వాయిదా వేసింది. ఇదిలావుండగా శుక్రవారం సిబిఐ ఎదుట విచారణకై ఇండియన్‌ మినరల్స్‌ బ్యూరో అధికారులు, ఇండియా సిమెంట్స్‌ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.
ఏ క్షణంలోనైనా బిపి ఆచార్య అరెస్టు?
ఎమ్మార్‌ అవకతవకల వ్యవహారంలో ఛార్జీషీట్‌ దాఖలు చేసేందుకు సమయం దగ్గరపడుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మార్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్యను ఏక్షణంలోనైనా సిబిఐ అదుపులోకి తీసుకునే అవకాశముంది. ఈనెల 31వ తేదీలోగా ఎమ్మార్‌ కేసులో ఛార్జీషీటును దాఖలు చేయాలని సిబిఐ భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారైన బిపి ఆచార్యను అరెస్టు చేసేందుకు కేంద్రం నుంచి రావల్సిన అనుమతులు సిబిఐకి వచ్చినట్లు తెలిసింది.

Leave a Reply

free website analytics