మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం.. ఎల్ అండ్ టీతో ఒప్పందం

గత మూడేళ్లుగా నగర ప్రజలను ఊరిస్తున్న మెట్రో రైలు దూసుకొస్తోంది. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చక చక చర్యలు ప్రారంభించింది. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెట్రో రైలు ఒకటే శరణ్యమని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభించడం ఇక లాంఛనమే. దేశంలోనే అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించు, నిర్వహించు, పైనాన్స్ బదలాయించు (డిబిఎఫ్‌ఓ) తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న ఎల్ అండ్ టి (లార్సెన్ అండ్ టూబ్రో) సంస్థతో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సమక్షంలో శనివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి టి.ఎస్.అప్పారావు, ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.బి.గాడ్గిల్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ప్రాజెక్టుకు అవసరమయ్యే సుమారు 269 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం డిసెంబర్‌లోగా ఎల్ అండ్‌టికి స్వాధీనం చేయాల్సి ఉంది. స్థలం స్వాధీనం చేసిన తర్వాత జనవరిలో మూడు రూట్లలో 71.6 కిలో మీటర్ల దూరంలో రూ.12,132కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు పనులు లాంఛనంగా ప్రారంభిస్తారు. మెట్రో రైలు పనులను దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ రూ.1458కోట్లు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (బిజిఎప్) కోరింది. ప్రాజెక్టు వ్యయంలో 12శాతం మాత్రమే. మిగిలిన వ్యయాన్ని ఎల్ అండ్ టి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు రూ.360కోట్లు ఫైనాన్సియల్ క్లోజర్స్ ముందస్తుగా బయానా ఎల్ అండ్ టి ఆరు మాసాల్లోగా బ్యాంగ్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రభుత్వ గోల్డెన్ షేర్ ఉంటుంది.
స్థలాల సేకరణకు రూ.1980కోట్లు…
మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమయ్యే 269 ఎకరాల స్థలంలో ప్రభుత్వానికి చెందిన స్థలాలు 65 ఎకరాలుగా గుర్తించారు. మిగిలిన 204 ఎకరాల స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రూ.1980కోట్లు పరిహారంగా చెల్లింపులు నెరపనున్నారు. స్థలాల సేకరణకు అవసరమయ్యే నిధులలో ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.500కోట్లు విడుదల చేసింది.
ప్రాజెక్టులోని కొన్ని ముఖ్యంశాలు….
* మొదటి దశలో 3 మార్గాల్లో 71.16కిలోమీటర్ల దూరంలో రైలు మార్గం నిర్మాణం చేపట్టనున్నారు.
* మియాపూర్ -ఎల్బీనగర్ మధ్య 29.87కిలోమీటర్లు. జూబ్లీబస్‌స్టేషన్-ఫలక్‌నామా 14.78కిలోమీటర్లు. శిల్ఫారామం-నాగోలు మధ్య 26.51కిలోమీటర్లు.
* మున్సిపల్ చట్టం 2008 ప్రకారం అమలవుతోంది.
* 35 సంవత్సరాలుగా నిర్మాణ సంస్థ నిర్వహణ బాధ్యత నిర్వహిస్తోంది. ఇందులో అయిదేళ్లు నిర్మాణానికి, అనంతరం మరో 25ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతను నిర్మాణసంస్థకు పొడిగించే వీలుంది.
* 2014నుంచి నిత్యం 15లక్షల మంది మెట్రో రైలు ద్వారా ప్రయాణిస్తారని పేర్కొన్నారు.2014వరకు ప్రయాణీకుల సంఖ్య 22 లక్షలకు పెరగనుందని అంచనా.
* ప్రభుత్వం స్వాధీనం చేసే స్థలంలో 18.5మిలియన్ల గజాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేందుకు వీలు కల్పించారు.
* భద్రత బాధ్యత నిర్మాణ సంస్థదే.
ప్రపంచానికే తలమానికం ‘మెట్రో’
రాష్ట్ర రాజధాని నగరంలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచానిే తలమానికంగా మారనుందని ముఖ్యమంత్రి రోశయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రూట్లలో 71.6 కిలో మీటర్ల దూరంలో (ఎలివేటెడ్) ఏర్పాటు చేయనున్న మెట్రోరైలు మార్గం ప్రపంచంలోనే అతి పెద్దదన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ వేగిరంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అభివృద్ధి పథకాలు ప్రారంభిస్తున్న తరుణంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని, దూర దృష్టితో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.
జెక్టు పనులు అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయాలని ఆయన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులను కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టు ద్వారా 5వేల మంది ఇంజనీర్లు, 45వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుతో గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరనుందన్నారు.ప్రాజెక్టుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1458కోట్లు మంజూరు చేసిందని ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం, దానం, ముకేశ్‌గౌడ్, సబితా , ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.వి.ప్రసాద్, ఎల్ అండ్ టి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మెన్ వై.ఎం.డియోవత్సాలీ, మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్ ఛైర్మెన్ డాక్టర్‌సివిఎస్‌కే శర్మ, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్ రెడ్డి అడె్వైజర్ టి.స్టాన్లీ బాబు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




