మే నెలలో టిటిడి అంతర్జాతీయ సదస్సు!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 11, 12వ తేదీల్లో నిర్వహించతలపెట్టిన అంతర్జాతీయ సదస్సు రద్దు చేసిన విషయం విదితమే. అయితే ఈ సదస్సును మే నెలలో తిరుపతిలోని శ్వేతా భవన్‌లో నిర్వహించనున్నట్టు సమాచారం. రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంను రద్దు చేసినట్టు తెలిసింది. టిటిడిపై పలువురు రాజకీయ పార్టీ నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి తలపడనున్నారని ఇంటెలిజెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో సదస్సు రద్దు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో నిర్వహించనున్న సదస్సును రద్దు చేయాలని స్థానిక శాసనసభ్యుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదిక, స్థానిక శాసనసభ్యుని విజ్ఞప్తి మేరకు సెమినార్‌ను రద్దు చేశారు. శాసనసభ సమావేశాల అనంతరం మేలో ఈ సెమినార్ నిర్వహించుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా ఉన్నతాధికారులకు తెలిపినట్టు సమాచారం.




