మొదటి బంతికి సిక్సర్ కొట్టిన అరవింద్
డీజీపీ అరవిందరావు తన తొలి ప్రయత్నంలోనే పెద్ద కార్యక్రమాన్ని చాలా ప్రశాంతంగా నిర్వహించగలిగారు. రాష్ర్ట ప్రజలలో సునామి నుంచి తమను రక్షించారన్న పేరు సంపాదించుకున్నారు. బాధ్యతలు చేపట్టి నాలుగు రోజులు కాకుండానే ఆయనకు ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ ఒక పెను సవాల్‌గా నిలిచింది. దాన్ని అరవిందరావు అత్యంత సమర్థంగా ఎదుర్కోని పరీక్షలు సజావుగా సాగేందుకు పక్కా వ్యూహాన్ని రచించి విజయం సాధించారు, ఒక్క ఉస్మా నియా వర్శిటీ బీఈడీ కాలేజీ కేంద్రం వద్ద కొద్దిపాటి ఘర్షణ, విద్యార్థులను చెదర గొట్టేందుకు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం మినహా కాల్పుల దాకా పరిస్థితి వెళ్ళకుండా జాగ్రత్త వహించారు. విద్యార్థులతో వ్యవహారం కాబట్టి పూర్తి సంయమనం పాటించాలన్న ఆదేశాలు ముందుగానే జారీ చేయటంతో ఉస్మా నియాలో గతంలో జరిగిన ఘటనలలాంటివి పునరావృతం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 445 పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయటం, మూడంచెల భద్రతా వ్యవస్థకు ఆదేశాలు జారీ చేయటం, ఎప్పటికప్పడు జంట నగరాలు, జిల్లా స్థాయి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ మార్గ నిర్దేశనం చేయటంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతల నుంచి కాస్తంత ప్రతిఘటన మినహా చెప్పుకోదగ్గ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించారన్న పేరును అరవిందరావు సంపాదించు కోగలిగారు.
డిజిపిగా కరణం అరవిందరావే సమర్థుడు. అప్పజెప్పిన బాధ్యతకు న్యాయం చేస్తాడు. వారం రోజుల క్రితం అందరూ వెలిబుచ్చిన అభిప్రాయం. అనుకున్నట్టే అరవిందరావు తొలి విజయం సాధించారు. గ్రూప్‌వన్ పరీక్ష ఎంతమందిని బలితీసుకుంటుందోననే భయం సర్వత్రా వ్యక్తమైంది. కానీ రాష్ట్రంలో ఎక్కడా చెప్పుకోదగ్గ రక్తపాతం లేకుండా… ఇంకా చెప్పాలంటే తీవ్రమైన ఘర్షణ అనేదే లేకుండాపరీక్షను సజావుగా నిర్వహించడం మామూలు విషయం కాదు. నిఘా పెడుతూనే, ఆందోళనకారుల వ్యూహాలను పసిగట్టడం, ప్రతిగా పోలీసులను అప్రమత్తం చేయడంలో అరవిందరావు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారని ప్రభుత్వం వర్గాలే అంటున్నాయి. ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా తేలికిగా పరిష్కరించగడన్న నమ్మకం కల్గించారు. గ్రూప్‌వన్ పరీక్షపై తెలంగాణా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకదశలో ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయడం మినహా చేసేదేమీ లేదనే ప్రచారం జరిగింది. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఉద్యమిస్తుంటే… పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందోననే అనుమానం వెంటాడింది. ఈ దశలో ప్రభుత్వం ముందుగా పోలీసుల అభిప్రాయాన్నే పరిగణలోనికి తీసుకుంది. హింసకు తావు లేని పరీక్ష నిర్వహణకు శాయశక్తులా కృషి చేస్తానని అరవిందరావు ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు. ఆయన సత్తాపై నమ్మకం ఉన్న గవర్నర్ కూడా ఎలాంటి భయం లేదని కేంద్రానికి తెలిపింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికి ఉస్మానియా ఘటన కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ఏం జరగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఇలాంటి సందర్భంలో పోలీసుల నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా జాగ్రత్తపడ్డారు. అక్కడి పరిస్థితిని డిజిపి ఎప్పటికప్పడు పర్యవేక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తం కాకుండా జాగ్రత్త పడ్డారు. అరవిందరావు నెట్‌వర్క్ ఏమిటో పోలీసులందరికీ తెలుసు. ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యమం, ఏ నాయకుడు చేస్తాడో ఆయనకో అంచనా ఉంది. నిఘా అధిపతిగా దీనిపై ఆయన పూర్తిస్థాయి అధ్యయనం చేశారు. ఈ అనుభవంతోనే అరవిందరావు జిల్లా ఎస్పీలకు సరైన సూచనలు చేశారు. సిబ్బందిని కలుపుకుపోతూ ముందుకు నడిపించడమూ ఆయన విజయ రహస్యంగా చెప్పాలి.
ఉస్మానియా విద్యార్థుల విషయంలో పోలీసుల అంచనాలు మొదటి నుంచి తలకిందులవుతున్నాయి. కెసీఆర్ దీక్ష చేపట్టిన తర్వాత ఉస్మానియా ఒక్కసారిగా భగ్గుమంది. అసెంబ్లి ముట్టడి చేస్తామన్న పిలుపు పోలీసు వర్గాలను కలవరపరచింది. అదే జరిగితే అసెంబ్లి వద్ద పెద్ద ఎత్తున రక్తపాతం జరగవచ్చని రాష్ట్ర పోలీసు వర్గాలు కేంద్రానికి నివేదించాయి. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర హోంమంత్రి హడావిడిగా తెలంగాణా ఏర్పాటు ప్రక్రియపై ప్రకటన చేశారు. దీంతో సీమాంధ్ర ఉద్రిక్తం కావడంతో కొత్త సమస్య వచ్చింది. ఇలా ఒకదాని వెంట ఒకటి జరిగిన అనేక పరిణామాలకు ఉస్మానియా వేదికగా మారుతోంది. ఆఖరుకు కొన్ని నెలల క్రితం జరిగిన లాఠీచార్జి, కాల్పుల విషయంలోనూ పోలీసుల అత్యుత్సాహం అనేక అనర్థాలకు దారితీసింది. తాజాగా ఇలాంటి పరిస్థితే తలెత్తే వీలుందని అందరూ ఊహించారు. అడుగడుగున పోలీసుల నిర్బంధం హింసకు కారణమవుతుందని భావించారు. కానీ ఉస్మానియాలో ఏ ఒక్క వ్యక్తి గాయపడకపోవడం కొత్త డిజిపి చాకచక్యమేనని అన్ని వర్గాలు అనుకుంటున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తొందరపడవద్దని అరవిందరావు పోలీసు శ్రేణులకు చెప్పినట్టు సమాచారం. ఈ ప్రకారమే ఆందోళనకారులు కొంతమేర నిరసనతో సరిపెట్టుకున్నారు. గతంలో మాదిరి పోలీసులు ఈసారి హడావిడి చేసి ఉంటే…. ప్రభుత్వం తలెత్తుకోలేని పరిస్థితి వచ్చి ఉండేదని మేధావి వర్గం భావిస్తోంది.
నిరంతర ప్రజా సంబంధాలు: డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన అరవిందరావు మంచి ప్రజా సంబంధాల వైపే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. గ్రూప్‌వన్ పరీక్ష విషయంలోనూ ఆయన ఈ కోణంలోనే ముందుకెళ్ళారు. ఆయనతో సన్నిహిత సంబంధాలున్న అనేక మంది నుంచి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. పరిస్థితిని ఎలా చక్కబెట్టాలనే విషయంలో అనుభవజ్ఞుల సూచనలు పాటించారు. చురుకైన అధికారులపై పూర్తి నమ్మకంతో బాధ్యతలు అప్పగించారు. ఇవన్నీ అరవిందరావు తొలి విజయానికి కారణాలుగా పేర్కొనవచ్చు.
అయితే ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఎవరు ఉత్తీ ర్ణులు అయినా, కాకపోయినా ఫలితాలు వెలువడక ముందే ముఖ్యమంత్రి రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావు తాము చెప్పినట్టు చేసి పరీక్షలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర పార్టీల నేతలు, జేఏసీలు…ఇలా ఎందరు చెప్పినా, విన్నపా లు చేసుకున్నా ముఖ్యమంత్రి తాను అను కున్నట్టే చేశారు. ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతి పత్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ వివాదంలో తాను తల దూర్చబోనని మంత్రుల బృందం తో చెప్పేసిన ఆయన, చెదురుమదురు ఘటనలు మినహా పరీక్ష తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారన్న పేరు సంపాదించుకున్నారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఏది ఎలా ఉన్నా ఈ పరీక్షలో రోశయ్య పాస్ అయ్యారంటూ వ్యాఖ్యానించటం విశేషం. వాస్తవానికి శనివారం నాటి సాయంత్రమే రోశయ్య తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి గందర గోళమూ లేదన్న వ్యాఖ్య చేసినప్పుడే అసలు విషయం తేలిపోయింది. ఎలాగైనా సరే పరీక్షను నిర్వహించి తీరుతామన్న ధోరణి ముఖ్యమంత్రి వ్యాఖ్య వెనుక కనిపించింది.
అలాగే అంతకు ముందు ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డితో టెలిఫోన్‌లో మాట్లాడి పరీక్షను వాయిదా వేయాలని చెప్పిన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆతర్వాత తెలంగాణ మంత్రుల బృందం ముఖ్య మంత్రిని కలిసేందుకు వెళ్ళినప్పుడు అక్కడ లేరు. ఆమె వేరే సమావేశానికి హాజ రయ్యారు. దానితోనే ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోదలచలేదని, ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకుని వివాదాస్పదుడు కాదలచలేదని తేలిపోయింది. పరీక్ష విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రాంతీయ పక్షపాత ముద్ర పడిపోతుందన్న ఉద్దేశంతోనే రోశయ్య ఈ విషయంలో తటస్థంగా ఉన్నట్టు చెబుతున్నారు.
సబిత…అంతా వ్యూహాత్మకం…
ఇక హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ వ్యవహారంలో మొదటినుంచీ వ్యూహాత్మకం గానే వ్యవహరించారు. పరీక్షను వాయిదా వేయాలని లేకపోతే భూకంపాలు సృష్టిస్తా మని టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు ఒకవైపు బెదిరింపులకు దిగినప్పటికీ, మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ నూతన డీజీపీ అరవిందరావుతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం మీడియా కలసినప్పుడు పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను తాను కోరానని మాత్రమే చెప్పారు తప్ప అటువైపు నుంచి స్పందన ఏమిటన్నది బహిర్గతం చేయలేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి మాత్రమే చెబుతానన్నారు. ఈ వ్యవహారంలో సబిత మొదటినుంచీ వ్యూహాత్మకంగానే వ్యవ హరిస్తూ వచ్చారు. శనివారం ఉదయం సహచర మంత్రులు డి.శ్రీధరబాబు, డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పరీక్షను వాయిదా వేయకపోతే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పినప్పుడు సబిత ఆ విషయంలో మౌనం వహించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, డీజీపీతో తప్ప మిగిలిన వారితో మాట్లాడరాదని నిర్ణయించుకున్న ఆమె అదే వ్యూహాన్ని అనుసరించి అనుకున్న రీతిలో పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీ చైర్మన్‌కు ఫోన్ చేసి మాట్లాడటం ద్వారా తాను తెలంగాణ ప్రాంతం వారికి అనుకూలంగా ఉన్నానని, ఆ తర్వాత పరీక్షను నిర్వహింపజేయటం ద్వారా రాష్ట్రం మొత్తానికీ తాను మంత్రిననీ ఆమె నిరూపించుకున్నారు.





