యుపిఎ పై అవిశ్వాస అస్త్రం
యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశాపెట్టాలని ఎస్పీ, ఆర్జేడీ పక్షాలు నిర్ణయించాయి. యుపిఎ కూటమి నుండి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఈ పక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస అస్త్రన్ని ప్రయోగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆర్జేడీ, ఎస్పీ పక్షాల అధినేతలు లాలూ, ములాయాం ల నిశ్చయించారు. యుపిఎకి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాయాలని ఇరువురు నేతలు భావిస్తున్నారు. బుధవారం సమాజా వాదీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ములాయాం నేతృత్యంలో సాగిన ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకున్నారు. మహిళా బిల్లును తాము వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం, ఓటింగ్ జరపడాన్ని ములాయాం తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే ఆర్జేడీ అథినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీరు పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహిళా బిల్లుపై తమ అభ్యంతరాలను లెక్క చేయకుండా సభలో నెగ్గించుకోవడంపై లాలూ, ములాయాంలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభలో నిరసన వ్యక్తం చేసిన తమ పార్టీ సభ్యలపై సస్పెన్షన్ వేటు వేయడంపై కూడా ఇరువురు నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ కారణాలతోనే యుపిఎకి మద్దతు ఉపసంహరించాలని, ఆలాగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని ఈ ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్రపతికి లేఖ కూడా రాయాలని లాలూ, ములాయాంలు నిర్ణయం తీసుకున్నారు.




