రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

22.01
రాష్ట్రంలో కరువు తీరా వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాలకు అల్పపీడన ద్రోణి తోడవడంతో గత 3రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఫలితంగా ఈ సీజన్‌లో ఇప్పటికి సాధారణం కంటే 27 శాతం ఎక్కువ వర్షం నమోదైంది.  రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 26 వరకు సగటున 268.9 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే, ఈ సారి రికార్డు స్థాయిలో 341 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. సోమవారం నాటికి సాధారణం కంటే.. రాయలసీమలో 52 శాతం, కోస్తాంధ్రలో 48 శాతం, తెలంగాణలో 10 శాతం ఎక్కువ వర్షం కురిసింది. 17 జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం అధికంగా వానలు పడ్డాయి.  ఈ జాబితాలో గుంటూరు(75.8 శా తం), హైదరాబాద్(74.2), కర్నూలు(62), ప్రకాశం(59.3), చిత్తూరు(55.1), కడప(55), కృష్ణా(54.1), విశాఖపట్నం(52.5), నెల్లూరు (51.5), విజయనగరం(49.5), తూర్పుగోదావరి(49.3), రంగారెడ్డి(47.1), ఖమ్మం(42.2), పశ్చిమ గోదావరి(40.4), అనంతపురం(35.5), మహబూబ్‌నగర్(32.8), వరంగల్(30.2 శాతం) జిల్లాలు ఉన్నాయి.  అలాగే, నల్లగొండ, మెదక్, శ్రీకాకుళం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సాధారణ వర్షం నమోదైంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం లోటు వర్షం ఉంది. కరువు తీరా వర్షం కురుస్తుండడంతో రాష్ట్రంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేని వానల వల్ల వ్యవసాయ పనులు చేపట్టేందుకూ కూడా రైతులకు సమయం చిక్కడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మెట్టపంటల సాగు దాదాపు పూర్తి కావొచ్చింది. అటు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు కూడా కళకళలాడుతున్నాయి. దీంతో వరి సాగు ఊపందుకుంటోంది.
దేశమంతటా సమృద్ధిగా వర్షాలు..
మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్, పశ్చిమ జార్ఖండ్, బీహార్ మినహా ఈ ఏడాది దేశమంతటా సంతృప్తికరమైన వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు దేశం మొత్తం విస్తరించిన తరువాత రాజస్థాన్‌లోని గంగానగర్ నుంచి బంగాళాఖాతం ముఖ ద్వారం (హెడ్‌బే) వరకు ఉండే రుతుపవన ద్రోణి బలపడి వాయుగుండంగా మారుతుంది.  అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క వాయుగుండం కూడా లేకపోయినప్పటికీ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు. రుతుపవనాలు చురుగ్గా ఉంటూ వర్షాలు విస్తారంగా కురవడానికి ‘లానినా’ ప్రభావమేనని భానుకుమార్ వెల్లడించారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి 2010 జనవరి వరకు ‘ఎల్‌నినో’ పరిస్థితులు కొనసాగినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఒక్కసారిగా ‘లానినా’ ప్రభావం కనిపించిందన్నారు. భూమధ్యరేఖ సమీపాన ఫసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉంటే ‘లానినా’ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.
సీఎం హర్షం
రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవటంపై ముఖ్యమంత్రి రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం విపత్తుల నిర్వహణ కమిషనర్ టి.రాధను, జిల్లాల కలెక్టర్లను కోరారు. ఆయన ఢిల్లీ నుంచే టెలికాన్ఫరెన్స్ ద్వారా వీరితో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply