రాష్ట్ర ప్రగతిని కేంద్రం గుర్తించింది – సిఎం

అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు రూపొందించి విజయవం తంగా అమలు చేస్తున్న ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో సాధిస్తున్న ప్రగతి జాతీయ స్థాయి కీర్తి గడిస్తున్నదని హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్ర ప్రభు త్వంలోని పెద్దలు అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా పేర్కొనడం గర్వకారణమని అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గజ్వేల్ గ్రామ పంచాయితీని పురపాలక ప్రాంతంగా ప్రకటించి నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర ప్రగతినుద్దేశించి సిఎం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు మనవద్ద అమలవుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా పకడ్బందీ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నా మన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొనడం గర్వించదగిన విషయమని చెప్పారు. దీంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని కేంద్రం ధృవీకరించినట్లేనని తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకోవడానికి ఇంతకన్నా పెద్ద సర్టిఫికేట్ అవసరం లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల కోసం తమ ప్రభుత్వం కొత్తగా ఃరూపాయికే కిలో బియ్యంః పథకాన్ని ప్రారంభించిందని కిరణ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం దాదాపు 2.26 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తోందన్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు, మహిళలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు, ఒక్కో సంక్షేమ పథకానికి సుమారు వెయ్యికోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్న ఘనత దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏడేళ్ళ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించిన అన్ని పథకాలను అమలు చేస్తూనే కొత్తగా మరిన్ని పథకాలను ప్రవేశపెట్టామన్నారు. అందులో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ యూనిట్ వ్యయాన్ని గణనీయంగా పెంచామని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలన్నింటినీ చెల్లించామని తెలిపారు. 2008 నుంచి గత ఏడాది డిసెంబర్ నాటికి బకాయి పడిఉన్న బోధనా ఫీజుల మొత్తం రూ.5,300 కోట్లు విడుదల చేశామన్నారు. మహిళలకు అందిస్తున్న పావలా వడ్డీ రుణాల కోసం గత ఏడాది వరకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఒక్క ఏడాదిలో రూ.870 కోట్లు ఖర్చు చేశామన్నారు. అదే విధంగా మిగిలి ఉన్న పావలా వడ్డీ బకాయిలు సుమారు రూ.400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మహిళలకు ఇస్తున్న రుణాలపై ఎలాంటి వడ్డీ లేదని సూచించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేయబోరని, ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చినప్పుడే పార్టీకి న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల బాధ్యతను గుర్తించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచారం నిర్వహించాల్సి ఉందన్నారు. జరుగుతున్న అభివృద్ధి వంద రూపాయలతే, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది కేవలం ఒక్క రూపాయికి మాత్రమేనని పేర్కొన్నారు. అదే ఇతర పార్టీలైతే రూపాయి పనిచేసి వంద రూపాయలు చేసినట్లుగా ప్రచారం చేసేవారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలు ఏ మేరకు విజయవంతమవుతున్నాయనే అంశంపై ఇటీవల ఒక సర్వే నిర్వహించగా ఆశించిన మేరకు ప్రజల్లో అవగాహన కనిపించలేదని చెప్పారు. రబీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వడ్డీలేని పంట రుణాలపై 50 శాతం మంది రైతులకు మాత్రమే అవగాహన ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పేదలు, మధ్య తరగతి కుటుంబాలే కాకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబం గ్యాస్ సిలిండర్‌పై రూ.25 సబ్సిడీ పొందుతున్నదని తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 శాసనసభ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నదని, వచ్చే ఎన్నికల్లో మిగతా రెండు స్థానాలను కూడా దక్కించుకుని ఆ జిల్లాను పార్టీకి కంచుకోటగా మార్చవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని గుర్తుచేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌లు సిఎంను కలిసిన కార్యకర్తలతో పాటు ఉన్నారు.




