రాష్ట్ర విచ్ఛిన్నకర శక్తులను అడ్డుకుందాం – చిరంజీవి పిలుపు

img1091218041_1_1ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శుక్రవారం తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పర్యటన ప్రారంభించారు. ప్రజలనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ… కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ కుటిల ప్రయత్నాన్ని మనమంతా మూకుమ్మడిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందనీ, దేశంలోనే అగ్రగామిగా నిలబడగలదని చిరంజీవి పేర్కొన్నారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములకు పుష్పమాలలను సమర్పించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  తెలుగుభాష మాట్లాడేవారంతా ఒకే గూటిలో ఉండాలన్నారు. ఆ గూడును విచ్ఛిన్న చేసేందుకు యత్నిస్తున్న శక్తులను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణా నుంచి నలుగురు ముఖ్యమంత్రులు వచ్చారనీ, వారి హయాంలో తెలంగాణా అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.  తెలంగాణా సమస్యను కేవలం తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం వల్లనే ఇటువంటి దుష్పరిణామాలు తలెత్తుతున్నాయన్నారు. నేడు కూడా స్వార్థంకోసమే కొందరు నాయకులు రాష్ట్రాన్ని ఎలాగైనా ముక్కలు చేసేందుకు శత విధాలా యత్నిస్తున్నారనీ, ఆ యత్నాలను మనమంతా ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.  ఈ ఉద్యమాన్ని పీఆర్పీ, కాంగ్రెస్, తెలుగుదేశం.. ఇలా అన్ని పార్టీల సోదరులు, సోదరీమణులు ముందుకు తీసుకవెళ్లాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా సమైక్యాంధ్రను సాధించాలని అన్నారు. తిరుపతిలో చిరంజీవి పర్యటనకు భారీ జనసందోహం తరలి వచ్చింది. వారంతా చిరంజీవికి మద్దతు పలుకుతూ.. జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

Leave a Reply

free website analytics