రాష్ర్టంలో విస్తుతంగా పోటెత్తిన వరదలు

మరో పర్యాయం తూర్పు తడిసి ముద్దయ్యింది. ఒకప్రక్క గోదావరి వరద ఉధృతి, మరో ప్రక్క అధిక వర్షాలతో జిల్లా అతలా కుతలం అవుతున్నది. ముఖ్యంగా కోనసీమ నీటి ముంపులో వుంది. గోదావరి కాచ్‌మెంట్‌ ఏరియాలోను, ఏజెన్సీలోను భారీగా వర్షాలు పడడంతో గోదావరి ఉప్పొంగుతుంది. ఆదివారం అర్థరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఇప్పటికి 9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులు తున్నారు. మరోపక్క కోనసీమ వర్షపు నీటి ముంపులో వుంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజాము వరకు కురిసిన సుమారు 20 సెం.మీ.ల వర్షపాతంతో కోనసీమ తడిసి ముద్దయ్యింది.
ఇంత భారీగా కురి సిన వర్షపాతం వల్ల కోనసీమలో పంట పొలాలన్నీ ముంపులో వున్నాయి. సుమారు 50 వేల ఎకరాలలో వరిపంట పూర్తిగా నీటముంపులో వుంది. గోదావరి నిండుగా పారడం, డ్రైన్లు అన్నీ బిగబట్టడంతో పంట పొలాలలో నీరు ఎగదన్నడంతో ఖరీఫ్‌ ఉక్కిరిబిక్కిరవు తుంది. పరిస్థితి ఇదే విధంగా రెండు, మూడు రోజులపాటు కొనసాగితే ఖరీఫ్‌పై ఆశ వదులుకోవలస్సిందేనన్న భయంతో కోనసీమ రైతాంగం వుంది. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటికే సుబ్బారెడ్డి సాగర్‌కు గండి పడడం, ఆనక పూడ్చివేత జరిగింది. ఏలేరు ఆయకట్టుతో పాటు విశాఖ జలాలకు నీరందించే ఏలేరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకుంది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజులలో కూడా అల్పపీడనం ప్రభావం వల్ల వర్షాలు కురిస్తే అటు డెల్టాలోను, ఇటు ఏలేరు రిజర్వాయర్‌కు ముప్పు పొంచివుం దం టున్నారు.
వశ్చిమంలోనూ అదే పరిస్థితి
ఏలూరు,మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : పశ్చిమ గోదావరి జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, డ్రైన్లు పొంగిపొర్లడంతో లక్షా 50 వేల ఎకరాలు నీటి మునిగాయి. గత నాలుగు రోజులుగా జిల్లాలోని ప్రధాన వాగులకు వస్తున్న వరద నీరు తగ్గకపోవడంతో పరిస్థితి మరింతగా జఠిలమవుతుందని ఆం దోళన చెందుతున్నారు.ఇప్పటికే జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
మరింతగా వస్తున్న తమ్మిలేరు, రామిలేరు, కొవ్వాడ, ఎర్రకాలువ, గొంతేరు డ్రైన్‌, యనమదుర్రు డ్రైన్లు, మొయ్యేరు లాంటి ప్రధాన డ్రైన్ల ద్వారా వస్తున్న వరద నీటితో కొల్లేరు నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే అనేక కొల్లేటి గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీనికి తోడు గోదావరికి కూడా భారీ ఎత్తున వరద రావడంతో ఏటిగట్టు పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.రానున్న రెండు రోజులలో గోదావరి నీటి మట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించడంతో ఏటిగట్టు ప్రజలు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతం, పల్లపు ప్రాంతం అనే బేధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వరద పరిస్ధితి ఒకేలా ఉండడం, గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

free website analytics