రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీలో రగిలిన చిచ్చు – యానాం ర ణరంగం!

పోలీసు దెబ్బలకు కార్మిక నాయకుడు మురళీమోహన్ మృతి
ఆగ్రహంతో విరుచుకుపడ్డ కార్మికులు.. దాడిలో ఫ్యాక్టరీ వైస్‌చైర్మన్ చంద్రశేఖర్ మృతి
ఫ్యాక్టరీ, లారీలు, గోడౌన్లకు నిప్పు.. విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసిన ఖాకీలు
అనుమతి లేకుండా కార్మికులపైకి కాల్పులు.. ముగ్గురి పరిస్థితి విషమం
కార్మికులు, యాజమాన్యం మధ్య వివాదమే ఘర్షణకు మూలం
కాకినాడ సమీపంలోని యానాం (కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగం) శుక్రవారం రణరంగమైంది. రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ కేంద్రంగా రేగిన చిచ్చు యానాంను అగ్నిగుండంలా మార్చేసింది. పోలీసుల దెబ్బలకు ఫ్యాక్టరీ కార్మిక నాయకుడు ప్రాణాలు కోల్పోవడం… ఆగ్రహావేశాలకు లోనైన కార్మికులు ఫ్యాక్టరీకి నిప్పుపెట్టడం.. వారి దాడిలో వైస్ చైర్మన్ చనిపోవడం.. లూటీలు.. పోలీసు కాల్పులతో.. ఆ ప్రాంతమంతా యుద్ధభూమిని తలపించింది. ఫ్యాక్టరీలో కార్మిక సంఘం స్థాపించడంతో కార్మికులకు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదమే ఈ ఘర్షణలకు దారితీసింది. ఇందులో కార్మిక నాయకుడు ముర ళీమోహన్(36), ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కొణిదెల చంద్రశేఖర్ (58) ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కాల్పు ల్లో గాయపడ్డ ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.
వివాదానికి నేపథ్యమిదీ..
అమలాపురం జీఎన్ నాయుడుకు చెందిన రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ పాతికేళ్ల చరిత్రలో ఏడాది క్రితమే కార్మిక యూనియన్ స్థాపించారు. ఎక్కువ పనిగంటలు, కనీస వేతనాలు ఇవ్వకపోవడం, యూనియన్‌ను యాజమాన్యం గుర్తించకపోవడం, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం తదితర సమస్యలపై రీజెన్సీ సిరామిక్స్ ఆఫీసర్స్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొంతకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్షంగా తొలగించిన మచ్చా మురళీమోహన్(యూనియన్ స్థాపకుడు)తోపాటు మరో 11 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని రిలే దీక్షలు చేస్తున్నారు.
అందరినీ తీసుకున్నా మురళీమోహన్‌ను తీసుకునేది లేదని యాజమాన్యం తేల్చిచెప్పడంతో వివాదం ముదిరింది. ఫ్యాక్టరీకి 200 మీటర్ల పరిధిలో కార్మికులు ఆందోళనలు జరపకుండా యాజమాన్యం కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. దీంతో కార్మికులు ఆంధ్రా ప్రాంతంలోని సుంకరపాలెం బైపాస్ రోడ్లో గత ఎనిమిది రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈ ఆందోళన కొనసాగుతుండగానే శుక్రవారం తెల్లవారుజామున మురళీమోహన్‌ను పోలీసులు బలవంతంగా యానాం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయనను విచక్షణా రహితంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. అయినా పోలీసులు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. ఈ విషయం తెలిసి ఐదారువందల మంది కార్మికులు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు మురళీమోహన్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
వైస్ చైర్మన్ ఇంటిపై దాడి
తమ కార్మిక నేత చనిపోయారన్న వార్త తెలియగానే కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆస్పత్రి ఆవరణలోని పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అనంతరం కొందరు కార్మికులు మెట్టకూరులో ఉన్న సిరామిక్స్ ప్లాంట్‌కు నిప్పు పెట్టారు. ప్లాంట్‌లో ఉన్న సుమారు 30 లారీలు, డీజిల్ బంకు, ప్లాంట్‌లోని కొంతభాగం, అనుబంధంగా ఉన్న అట్టల ఫ్యాక్టరీ, రెండు స్కూళ్లు, యాజమాన్యం నిర్వహిస్తున్న కాలేజీ బస్సులకు నిప్పంటించారు. మరికొందరు కార్మికులు జిక్రియానగర్‌లో ఉన్న ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కొణిదెల చంద్రశేఖర్ (ఈయన చైర్మన్ నాయుడుకు మేనల్లుడు) ఇంటిపై దాడి చేశారు. ఇందులో చంద్రశేఖర్‌కు తలపై బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే అదనుగా కొందరు స్థానికులు ఫ్యాక్టరీలోని వస్తువులను, సమీపంలోని భారత్ గ్యాస్ గోడౌన్లోని సిలిండర్లను లూటీ చేశారు. మరోవైపు చంద్రశేఖర్ మృతి వార్త తెలిసి ఆయన భార్య రాజేశ్వరి గుండెపోటుకు గురవటంతో కాకినాడ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
పిల్లారాయవీధిలోని పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన కార్మికులు, వివిధ పార్టీల నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసులు జరిపిన లాఠీచార్జిలో శేషుబాబ్జీ చేయి విరిగిపోగా, ఎన్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు సుబ్బారావుతో పాటు కత్తుల వెంకటేశ్వర్లు తదితర 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కార్మికులు ఆగ్రహోదగ్రులై పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కార్మికులపై తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గిడ్ల జాన్‌విక్టర్‌బాబు, కె.శ్రీనివాస్, నూకల శ్రీనివాస్‌లకు తలలో, కాళ్లలో బుల్లెట్లు దూసుకుపోవడంతో వారు అక్కడే కుప్పకూలిపోయారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో తొలుత యానాం ప్రభుత్వాస్పత్రికి, ఆ తరువాత కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పులకు పోలీసులు ఎలాంటి అనుమతీ తీసుకోలేదని అదనపు మేజిస్ట్రేట్, ఇన్‌చార్జి రీజినల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సుబ్రహ్మణ్యం ధ్రువీకరించారు. ఈ సంఘటనపై విచారణకు పుదుచ్చేరి ప్రభుత్వం డీఐజీ వీసీ శుక్లాను యానాంకు పంపించింది. ఈ పరిణామాల్లో కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించిందని భావిస్తున్నారు.

యానాంకు ప్రత్యేక బలగాలు..
రేణిగుంట: యానాంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలను పంపుతున్నట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె రేణిగుంట విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రీజెన్సీ కంపెనీలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అభ్యర్థన మేరకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బలగాలను పంపుతున్నామని తెలిపారు. మరోవైపు మంత్రి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి ఎస్పీ త్రివిక్రమవర్మ యానాంకు పోలీసులను పంపించారు. వారు రాత్రికల్లా యానాంలోని ఉద్రిక్త పరిస్థితులను కాస్త అదుపులోకి తీసుకువచ్చారు.
నేతల పరామర్శ: పోలీసుల దెబ్బలతో మృతిచెందిన కార్మికనేత మురళీమోహన్ కుటుంబ సభ్యులను, లాఠీచార్జి, కాల్పుల్లో గాయపడ్డ వారిని మంత్రి తోట నరసింహం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ రవిచంద్ర పరామర్శించారు. అమలాపురం ఎంపీ, రీజెన్సీ సిరామిక్స్ ఆఫీసర్స్, వర్కర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీవీ హర్షకుమార్.. మురళీమోహన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లు చేశారు. ఆ డిమాండ్లను పుదుచ్చేరి ప్రభుత్వం పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని కార్మికుల తరఫున ఎంపీ ప్రకటించారు. మురళీమోహన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.30 లక్షల నష్టపరిహారం, లాఠీచార్జి, కాల్పుల్లో గాయపడ్డ క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
కాల్పులకు సీపీఐ ఖండన
రీజెన్సీ ఫ్యాక్టరీలో కార్మికులపై పోలీసు కాల్పులను సీపీఐ తీవ్రంగా ఖండించింది. వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైందంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. మరణించిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.




