రెండో రౌండ్లో సానియా

sania23యూఎస్‌ ఓపెన్‌ ఆరంభం రోజున భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ పోటీల్లో హైదరాబాద్‌ స్టార్‌ సానియామీర్జా విజయకేతనం ఎగురవేయగా, పురుషుల సింగిల్స్‌లో యువకెరటం సోమ్‌దేవ్‌వర్మన్‌ పరాజయం పాలై నిరాశ పరిచాడు. ఈ పోటీలకు సోమ్‌దేవ్‌వర్మన్‌ నేరుగా అర్హత సాధించగా, ర్యాంకుల్లో దిగజారిపోయిన సానియామీర్జా క్వాలిఫైంగ్‌ పోటీల్లో గెలుపొంది మెయిన్‌డ్రాకు అర్హత సాధించింది. తొలిరౌండ్లో పోర్చుగల్‌కు చెందిన మిచెల్‌లార్చర్‌డి బ్రిటోతో తలపడిన సానియా అలవోక విజయంతో రెండో రౌండ్లో ప్రవేశించింది.
6-2, 6-3తో వరుస సెట్లలో గెలుపొంది సత్తా చాటుకుంది. పురుషుల సింగిల్స్‌లో సోమ్‌దేవ్‌ దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్‌ ఆండర్సన్‌ చేతిలో 3-6, 4-6, 3-6తో వరుస సెట్లలో పరాజయం పాలై పోటీల నుంచి నిష్ర్కమించాడు. తొలి సారి గ్రాండ్‌స్లామ్‌ పోటీలకు నేరుగా అర్హత సాధించిన సోమ్‌దేవ్‌ తొలిరౌండ్‌ గండాన్ని అధిగమించలేకపోయాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌, వింబుల్డన్‌ పోటీల క్వాలిఫైయింగ్‌ పోటీల్లోనే పరాజయం పాలైన ఈ భారత్‌ యువ సంచలనం, ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ తొలి రౌండ్లోనే పరాజయం పాలవ్వడం గమనార్హం. గత ఏడాది ఇదే యూఎస్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్న సోమ్‌దేవ్‌కు గ్రాండ్‌స్లామ్‌ పోటీల్లో అదే అత్యుత్తమ రికార్డు. గంటా 17 నిముషాల పాటు సాగిన తొలి రౌండ్‌లో తనదైన శైలిలో చెలరేగిన సానియా మీర్జా అలవోక విజయంతో రెండో రౌండ్లో అడుగుపెట్టింది.  క్వాలిఫైయింగ్‌ పోటీల్లో మూడు విజయాలు సాధించి మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన ఆమెకు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. రెండో రౌండ్లో సానియా రష్యాకు చెందిన 20వ సీడ్‌ పావ్ల్యుచెన్‌కోవాతో తలపడనుంది. ఇటీవల కాలంలో ర్యాంకుల్లో వెనుకబడినప్పటికీ తనతో సత్తా ఇంకా తగ్గలేదని తొలి రౌండ్‌ విజయం నిరూపించిందని మ్యాచ్‌ అనంతరం సానియా పేర్కొంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలుపొందిన స్ఫూర్తితో ఈ టోర్నీలో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు తనలో స్థైర్యం పెంపొందిందని తెలిపింది. క్వాలిఫైయింగ్‌ పోటీలు ఎదుర్కోవల్సి రావడం దురదృష్టకరమైనప్పటికీ తొలి క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లో గెలుపొందినప్పుడు తానెంతో ఆనందించానని, ప్రస్తుతం మెయిన్‌డ్రా తొలి రౌండ్‌ విజయంతో మళ్లీ ఆ ఆనందం దక్కిందని పేర్కొంది. గాయాలు, ఫాంలేమితో ఆమె ప్రపంచ ర్యాంకింగుల్లో 159వ స్థానానికి పడిపోయిన ఈ హైదరాబాద్‌ ఏస్‌ క్రీడాకారిణి 2005 తర్వాతగ్రాండ్‌స్లామ్‌ పోటీల్లో క్వాలిఫైయింగ్‌ పోటీలు ఎదుర్కోవల్సి రావడం ఇదే ప్రథమం.

Leave a Reply

free website analytics