రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ట్రాక్టర్‌ డ్రైవర్‌ అతివేగం కారణంతో అభం శుభం తెలియని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కొర్రపాడు గ్రామానికి చెందిన కమ్మరి సూర్యప్రకాశ్‌ (26), గొల్ల ఆవుల రమేష్‌ (26)లిద్దరికీ కొద్దిరోజుల క్రితం వివాహమైంది. నగరంలోని మార్కెట్‌యార్డు సమీపంలో ఆర్‌ఆర్‌ కోళ్లఫారంలో పనిచేస్తూ జీవిస్తున్నారు. ప్రతి రోజూ మాదిరిగానే పనికి పోయేందుకు గ్రామం నుంచి ఉదయం 5.30 గంటలకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు.
రెడ్డిపల్లి గ్రామంలోని డెయిరీఫామ్‌ వద్ద లారీ వెనుక వైపు వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఇసుక ట్రాక్టర్‌ అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అయితే లారీ వీరి ముందు ఉండడంతో వీరిద్దరూ లారీకి ఢీకొట్టారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన జరిగిన వెంటనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటన చూసిన గ్రామస్తులు కన్నీర పర్యంతమయ్యారు. ఒకే గ్రామానికి చెందిన యువకులు మరణించడంతో కొర్రపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరిరువురి భార్యలు గర్భవతులు కావడంతో పెళ్లై మూడు నెలలు కాకనే మరణించడంతో వారిద్దరి భార్యలు, కుటుంబ సభ్యులు చేసిన ఆర్థనాదాలు చూపరుల కంటతడి పెట్టించింది. పోలీసులు ఇసుక ట్రాక్టర్‌ యజమాని శింగనమల లక్ష్మన్న విచారించగా, డ్రైవర్‌ ఆచూకీ తెలియజేశారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు.

Leave a Reply

free website analytics