రోశయ్యా… నాటకాలాడకు

’400 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే గనులున్న ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని 1.40 లక్షల ఎకరాల భూములను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాలకు కట్టబెట్టిన వైనానికి సంబంధించి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలి’… అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందని స్పష్టీకరించారు.
మైనింగ్ రద్దు వ్యవహారం తమ పరిధిలోనిది కాదంటూ ముఖ్యమంత్రి రోశయ్య తప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. రక్షణ స్టీల్స్‌కు జరిపిన భూముల కేటాయింపులను రద్దు చేస్తే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మైనింగ్ వ్యవహారం చూసుకుంటుందని హితవు పలికారు. ఏపీఎండీసీ కేటాయింపులను రద్దు చేసే అంశంపై నాటకాలడవద్దంటూ రోశయ్యపై మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భూములతోపాటు కడప జిల్లాలో బెరైటీస్ గనులకు సంబంధించి వైఎస్ బావమరిది రవీంద్రనాధ్ రెడ్డికి ఇచ్చిన భూముల లీజును కూడా రద్దు చేయాలని ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఏపీఎండీసీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికే చెందినదైనందున ‘ఇల్లీగల్’ అగ్రిమెంట్లను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ‘నాకేమీ తెలియదంటూ’ ఒకసారి, ‘కేంద్రానికి లేఖ రాశానంటూ’ మరోసారి మాట్లాడుతున్న రోశయ్య నాటకాలాడుతున్నాడని ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. నాటకాలాడవద్దంటూ హితవు పలికారు. వైఎస్ జగన్‌ను లొంగదీసుకునేందుకు తప్ప ప్రజాప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంలేదంటూ ఆగ్రహించారు. ఖమ్మం, వరంగల్, కడప జిల్లాల్లోని ఆ భూములను వేలం పద్ధతిలో కేటాయించినపక్షంలో వచ్చే డబ్బుతో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. నిజంగా ప్రజాప్రయోజనాలను రక్షించే ఉద్దేశమే ఉంటే ఈ విషయంలో కప్పగంతులు వేయవద్దని ముద్దుకృష్ణమనాయుడు సూచించారు. రక్షణ స్టీల్స్ సంస్థతో ఏపీఎండీసీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంలో రోశయ్య వెనుకాడుతున్నాడని, ఆ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేసినపక్షంలో తన వాటా పోతుందని భయపడుతున్నాడని, తన కుమారుడికి, అల్లుడికి పెద్ద మూటలను ఇచ్చే ప్రయత్నం బెడిసికొడుతుందని ఆందోళన చెందుతున్నాడని ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. ఏదో అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నానని భావిస్తున్న రోశయ్య… ఈ క్రమంలోనే డబ్బు దండుకునే యత్నాల్లో ఉన్నాడని ధ్వజమెత్తారు.




