వాడవాడలా జననేతకు ఘనవినివాళి -పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ

ప్రజాహృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రధమ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. ఊరూరా, వాడ, వాడలా కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఆయనను స్మరిస్తూ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకున్నారు. అనేక గ్రామాలు, పట్టణాలలో రాజకీయాలకు అతీతంగా కూడా నేతలు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం. వైఎస్ ఘాట్ ఉన్న ఇడుపులపాయ, వైఎస్ స్మృతివనం ప్రాంతం జనసంద్రంగా మారాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది జనం జననేతకు కన్నీటి నివాళులు అర్పించారు. వైఎస్‌ఆర్ అమర్ రహే…, బడుగు జనబాంధవా నీకు మరణం లేదు.., మా గుండెల్లో ఉన్నావు…, జోహార్ వైఎస్‌ఆర్…, వంటి నినాదాల మధ్య తమ అభిమాన నేత చిత్ర పటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మహిళలు, వృద్దులు కన్నీటితో జోహార్లు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నిర్వహించాయి. రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నాయి. దివంగత నేత వైఎస్ సతీమణి వై.ఎస్. విజయారాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు, కడప ఎంపి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటిపెద్దను తలుచుకుని మౌనముద్రలో ఉండిపోయారు.ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వై.ఎస్.వివేకానందరెడ్డి, వైఎస్ సోదరి విమలమ్మ, కూతురు షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉదయమే వారు వైఎస్ ఘాట్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్రారావు అయన సతీమణి నివాళులు అర్పించారు. కెవిపి సతీమణి బోరున విలపించారు. ఇదిలా ఉండగా, వైఎస్ స్మృతివనం నల్లమలలోని పావురాలగుట్ట వద్ద 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని శాసనమండలి ఛైర్మన్ ఎ. చక్రపాణి, రాష్ట్ర మంత్రులు డి. మాణిక్య వరప్రసాద్, శిల్పామోహన్ రెడ్డి, వట్టి వసంతకుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివంగత నేత వర్ధంతి కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య తన నివాసంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పి. సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, మేయర్ బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సంక్షేమ పథకాలు అమలు చేసి వైఎస్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారన్నారు. వైఎస్ జ్ఞాపకార్థం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు వద్ద రూ. 20 కోట్లతో స్మారక వనం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. శాసనసభ లాబీలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, మాజీ మంత్రులు జేసీ దివాకరరెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. సిఎల్‌పి కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలో వాడవాడలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. సినీపరిశ్రమ సైతం వైఎస్‌కు శ్రద్ధాంజలి ఘటించింది. సినీహీరో శ్రీహరి, భైరవచిత్ర నిర్మాత నట్టికుమార్‌లు పేద కళాకారులకు వస్త్రలు పంపిణీచేశారు. ఎపి ఫిల్మ్ వర్కర్స్ కో ఆపరేటివ్ సౌసైటీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సినీనటుడు డాక్టర్ రాజశేఖర్, జీవిత పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, ఎపి జి.వి. హర్షకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
కడప జిల్లాలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి సాయిప్రతాప్, రాష్ట్ర మంత్రి మహ్మద్ అహ్మదుల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇడుపులపాయలో వైఎస్ సమాధిపై పుష్పగుచ్చం ఉంచి మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ స్మారక పార్కు పైలాన్‌ను ఆవిష్కరించారు. మాజీమంత్రి కొండా సురేఖ దంపతులు, అంబటి రాంబాబు తదితరులు కూడా వైఎస్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.
చిత్తూరు జిల్లాలో కూడా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి గల్లా అరుణ, ఎంపి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో జరిగిన వైఎస్ సంస్మరణ సభ జనసంద్రంగా మారింది. టిటిడి మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ సుదర్శన మహాయాగంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా 56 మంది రుత్వికులతో ఈ యాగం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాగాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల నడుమ సుదర్శనయాగం ప్రారంభమైంది. యాగంతో పాటు గణపతిపూజ, నవగ్రహపూజ, వివిధ పూజలు నిర్వహించి రాజ్యాధికార యాగాన్ని నిర్వహించారు. అనంతరం యాగ ఫలాన్ని కరుణాకరరెడ్డి, అంబటిరాంబాబు స్వీకరించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్‌కు ప్రాణంగా ఉన్న తాను ఆయన సంస్మరణ సభ నిర్వహించడం బాధగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, తాను మాత్రం ప్రాణాలతో ఉండటం సిగ్గు చేటన్నారు.
విశాఖపట్టణం జిల్లా కేంద్రంలో పోస్టల్‌శాఖ వైఎస్. రాజశేఖరరెడ్డి స్మారకార్థం రూ. 5 పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. విశాఖకు చెందిన దుర్గాప్రసాద్ రూపొందించిన ఈ స్టాంప్‌ను తపాలాశాఖ విశాఖపోస్ట్ మాస్టర్ జనరల్ శారద సంపత్ అధికారికంగా విడుదల చేశారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన వర్ధంతి కార్యక్రమాలలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎపి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలలో రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి డి.కె. అరుణ కొత్తగా ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే ఆయనకు నిజమైన నివాళిగా పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లాలో మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, దామోదర రాజనరసింహ, చిత్తూరు జిల్లాలో మంత్రి గల్లా అరుణ, నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనంతపురం జిల్లాలో మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, ప్రభుత్వ విప్ డాక్డర్ శైలజానాథ్ పాల్గొన్నారు. వారు ఇడుపులపాయకు కూడా వెళ్లి వైఎస్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లాలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్, శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మానప్రసాదరావు, విజయనగరం జిల్లాలో మంత్రి శతృచర్ల విజయరామరాజు, గుంటూరు జిల్లాలో మంత్రులు గాదె వెంకటరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పార్థసారథి, నిజామాబాద్ జిల్లాలో మంత్రి సుదర్శనరెడ్డి పాల్గొన్నారు.




