వాతావరణం చల్లగా ఉంది ఎందుకు వేడిక్కెస్తారు – గవర్నర్

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరేందుకు గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు వింత అనుభవం ఎదురైంది. “నేనేం చేయగలను? ఏ నిర్ణయమైనా ప్రభుత్వమే తీసుకోవాలి’ అని గవర్నర్ వారితో అన్నారు. అంతేకాదు.. ‘రాష్ట్ర వాతావరణం చల్లగా ఉంది, ఎందుకు వేడెక్కిస్తారు’ అని కూడా గవర్నర్ తమతో అన్నట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఎమ్మెల్యేలు టి.హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, కె.తారక రామారావు, పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి శనివారం ఇక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇవీ ఆ వివరాలు… టీఆర్ఎస్ బృందం: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయించండి. ఈ డిమాండ్‌కు అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ వాటా తేల్చకుండా పరీక్ష నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
గవర్నర్: రాష్ట్రం ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటోంది. దాన్ని చెడగొట్టొద్దు. మీరు చెబితే విద్యార్థులు ఊరుకుంటారు. ఆందోళన విరమిస్తారు.
టీఆర్ఎస్ బృందం: ఈ ఉద్యమం స్పాంటేనియస్‌గా వచ్చింది. తేలిగ్గా పోయేటట్లు కనిపించటంలేదు. ఆదివారం ఏం జరుగుతుందో ఊహించలేం. మీరే జోక్యం చేసుకొని పరీక్ష వాయిదా వేయించాలి.
గవర్నర్: నేనేం చేయగలుగుతాను. ఏ నిర్ణయమైనా ప్రభుత్వమే తీసుకోవాలి.
టీఆర్ఎస్ బృందం: పది రోజుల క్రితమే ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. తర్వాత ఆయన మమ్మల్ని పిలిచి మాట్లాడుతారని భావించాం. కానీ, ఎలాంటి స్పందన లేదు. చివరి ప్రయత్నంగా మీ వద్దకు వచ్చాం. పరీక్ష వాయిదా వేయాలని మీరు ప్రభుత్వానికి సలహా ఇవ్వచ్చు కదా..గవర్నర్: ప్రభుత్వంతో మాట్లాడి చూస్తాను. గవర్నర్‌తో భేటీ అనంతరం టీఆర్ఎస్ నేతలు విలేఖరులతో మాట్లాడారు. రోశయ్య ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1లో తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ వాటా తేల్చేవరకు ఏపీపీఎస్సీలో ఎలాంటి నియామకాలు జరపద్దని ఎమ్మెల్సీ, టీవీఎస్ కార్యదర్శి కె.దిలీప్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామి రెడ్డిని వెంటనే మార్చాలని, లేకపోతే కమిషన్ జరిపే నియామకాలపై విద్యార్థులకు నమ్మకం ఉండదని పేర్కొన్నారు. ఆదివారం విద్యార్థులు తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఇన్విజిలేటర్లు హాజరు కావద్దని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కోరారు. విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి వెళ్లి ప్రశ్నాపత్రాలను చించివేసి బయటికి రావాలని పిలుపునిచ్చారు.




