విద్యార్థుల సమస్యలు పట్టని ప్రభుత్వం – చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పట్టకుండా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలంటూ శుక్రవారం విద్యార్థులు నిర్వహించిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిది సంవత్సరాల కాలంలో పల్లె పల్లెకు పాఠశాలను ప్రారంభించి, ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించగా నేడు ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని దుస్థితి ఏర్పడిందన్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉపాధ్యాయులు లేక పదుల సంఖ్యలో పాఠశాలలు ఇప్పటికే మూతబడ్డాయని ఆందోళన చెందారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో కూడా ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందన్నారు. గ్రామాల్లో మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు. మందుబాబుల దగ్గరకు వెళ్లి మద్యం తాగటం వల్ల వచ్చే అనర్థాలను వివరించాలన్నారు.




