విఫలమైన టిఆర్‌ఎస్ వ్యూహం !

ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలలో తెలంగాణా ప్రాంతం వారికి 42 శాతం వాటా ఇచ్చేవరకు నియామకపు ప్రక్రియను నిలిపివేయాలంటూ తెలంగాణావాదులు డిమాండ్ చేసినా ప్రభుత్వం గతంలో ప్రకటించిన మాదిరిగానే ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. దీంతో టిఆర్‌ఎస్ పన్నిన వ్యూహం పూర్తిగా విఫలమైంది. వారి శక్తి సామర్థ్యాలు ఏమేరకు ఉన్నాయో తేట తెల్లమైపోయాయి. తెలంగాణా జేఏసీ, ఓయూ, కేయూ విద్యార్థి జేఏసీ, తెలంగాణా రాష్ట్ర సమితితోపాటు, ప్రజాప్రతినిధులు, మంత్రులు పరీక్షలను నిర్వహించవద్దంటూ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆదివారం పరీక్షా కేంద్రాల వద్దే అడ్డుకోవాలని టిఆర్‌ఎస్ నిర్ణయించారు. ఈ మేరకు పరీక్ష ప్రారంభమైన వెంటనే ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకువచ్చి లీక్ చేయడం ద్వారా న్యాయపరంగా దీన్ని అడ్డుకోవాలని టిఆర్‌ఎస్ వ్యూహాం రచించింది. ఇందుకు అనుగుణంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రశ్నాపత్రం ఇవ్వగానే పది నిమిషాల్లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం నుండి పేపర్లను బయటకు తీసుకువచ్చి మీడియా ముందు విద్యార్థులు ప్రదర్శించారు. దీంతో పరీక్షా పేపర్ లీకైందనే కారణంగా పరీక్షను రద్దు చేస్తారని తెలంగాణావాదులు ఊహిస్తున్నా ప్రభుత్వం మాత్రం పరీక్షను నిర్వహించి జవాబుపత్రాలను భద్రపరిచారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అరవింద్‌రావు ఒక ప్రకటన చేశారు. ఏదైన ఒక పరీక్షా కేంద్రం వద్ద ఏదైనా అనివార్య సంఘటన జరిగితే ఆ కేంద్రంలో మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహిస్తామని, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా డీజీపీ ప్రకటించారు. దీంతో ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తారా లేక పేపర్ లీకైన పరీక్షా కేంద్రంలో మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహిస్తారా అనేది అనుమానాస్పదంగా మారింది. తెలంగాణా జేఏసీ, తెరాస మాత్రం పరీక్షా పేపర్ రాష్ట్రంలో ఎక్కడా లీకైనా ఆ పరీక్షను రద్దుచేసే సంప్రదాయం ఉందని అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా పరీక్ష ప్రారంభించిన పది నిమిషాలలోనే పేపర్ లీక్ చేయడంలో విజయవంతమయ్యామనే విశ్వాసంతో ఉంది. ప్రభుత్వ స్పందన మాత్రం ఇంతవరకు స్పష్టంకాలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం పరీక్షను పూర్తిస్థాయిలో రద్దు చేయకూడదనే నిర్ణయానికి వస్తే న్యాయపోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణావాదులు ఇప్పటికే ఓ సూత్రప్రాయమైన నిర్ణయానికి వచ్చారు. సోమవారం వరకు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసి మంగళవారం టిఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని జేఏసీల నాయకులను పిలిచి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటికే హైకోర్టులో ఏపీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలంటూ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు కుమారుడు, న్యాయవాది కృష్ణ విజయ్ ఆజాద్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ గోపాల్‌రెడ్డి, ఎలాంగోలతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరపనుంది. ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించిన మీడియా క్లిప్పింగ్‌లను ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ తదితర న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.




