విశాఖ మందు గుండు గొడౌన్‌లో భారీ పేలుడు – 15 ఇళ్లు నేలమట్టం

విశాఖ నగరంలోని కురుపాం మార్కెట్ సమీపంలోని మందుగుండు గొడౌన్‌లో బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. దీంతో, ఐదుగురు గాయపడ్డారు. సుమారు 15 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరో 20 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.50 లక్షల నష్టం సంభవించింది. స్థానికుల, అధికారుల కథనం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మందుగుండు గొడౌన్‌లో మంటలు రేగాయి. ఆ సమయంలో గొడౌన్‌లో ఎవరూ లేరు. స్థానికులు, అప్పుడే ప్రార్థన చేసుకుని వస్తున్న ముస్లిం యువకులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇంతలో గొడౌన్‌లోని ఐదు గ్యాస్ సిలిండర్లకు మంటలు వ్యాపించి, ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో, తోపులాట జరిగింది. ఫాతిమా, ఇర్ఫాన్ హైదర్, గులామ్ హైదర్, నాగమణి, సత్యనారాయణ గాయపడ్డారు. భీశెట్టి కోటబాబు కాలు విరిగిపోయింది. వీరంతా కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో పరిసరాల్లోని 15 ఇళ్లు పూర్తిగా కూలిపోవడంతోపాటు మరో 20 ఇళ్లకుపైగా దెబ్బతిన్నాయి. సుమారు అరకిలోమీటరు మేర ఉన్న ఇళ్లలో కూడా ప్రకంపణలు సంభవించి, వస్తువులు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారిపైనున్న బంగారం షాపుల్లోని అద్దాలు పగిలిపోయాయి.
అగ్నిమాపకశాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో ప్రభాకరరావు, ఎసిపి కృష్ణమూర్తినాయుడు సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు క్షతగాత్రులను కెజిహెచ్‌లో పరామర్శించారు. ఆర్డీవో ద్వారా కలెక్టర్ శ్యామలరావు ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు తక్షణ సహాయం చేయాలని సూచించారు. ఇదిలావుండగా, రూ.5 లక్షలే నష్టం వాటిల్లి ఉంటుందని డిప్యూటీ తహసీల్దార్ మూర్తి ప్రజాశక్తికి తెలిపారు.
అధికారుల ఉదాసీనత వల్లే…
అధికారుల ఉదాసీనత వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో జనావాసాల మధ్యనున్న గొడౌన్‌ను తొలగించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులను తక్షణమే ఆదుకోవాలి : సిపిఎం
కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సిపిఎం విశాఖ నగర కార్యదర్శి కె.లోకనాధం, జగదాంబ జోన్ కార్యదర్శి సుబ్బారావు పరామర్శించారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ భద్రతా చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం కావడం వల్లే ప్రమాదం సంభవించిందని విమర్శించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునేవరకూ పూర్తిస్థాయిలో వైద్యసేవలందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఆస్తులు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.




