వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణకు జాతీయ బిసి కమిషన్‌ – చంద్రబాబు డిమాండ్‌


వెనకబడిన తరగతుల (బిసి) సమస్యల అధ్యయనం, హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగపరమైన జాతీయ బిసి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. బిసి కమిషన్‌ సిఫారసులను అమలుచేసి తగిన రీతిలో నిధుల కేటాయింపు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. జనాభా గణాంకాలను బిసి కులాలవారీగా సేకరించాలని, ప్రభుత్వ సంస్థల ద్వారానే సేకరించాలని ఆయన కేంద్ర ప్రభు త్వాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్‌టిఆర్‌ భవన్‌లో శుక్రవారం నిర్వ హించిన వెనకబడిన తరగతుల సాధికారిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని 125 బిసి కులసంఘాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఈ సదస్సులో తెదేపా సీనియర్‌ నేతలు టి.దేవేందర్‌గౌడ్‌, కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. బిసిల సమస్యల అధ్యయనం కోసం తెదేపా సీనియర్‌ నేత టి.దేవేందర్‌గౌడ్‌ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. వచ్చే మహానాడు నాటికి బిసి సమస్యలపై నివేదిక రూపొందించి పార్టీ అధిష్టానానికి ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగానే శుక్రవారం బిసి సంఘాలతో సమావేశమై వారి కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయం సేకరించారు. జిల్లాస్థాయిల్లో కూడా ఇలాంటి సదస్సులు నిర్వహించి గ్రామీణస్థాయిలో చేతివృత్తులు, కులవృత్తుల స్థితిగతులను అధ్యయనం చేయాలని ఈ సదస్సులో నిర్ణయించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 93 బిసి కులాల జాబితాలో మరికొన్ని కలిపి 123కు పెంచారని, అయితే రిజర్వేషన్లు మాత్రం ఆ మేరకు పెంచకపోగా, తగ్గించారని ఆయన మండిపడ్డారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌ కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిందని ఆయన చెప్పారు. మైనారిటీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిసి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చట్టసభల్లో ముస్లింలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అప్పుడే ఆ వర్గాలు సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతాయని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత సాధించిందని ఆయన గుర్తుచేశారు.
చట్టసభల్లో రిజర్వేషన్‌ అంశాన్ని జాతీయస్థాయిలో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ డిమాండ్‌ను జాతీయ పార్టీలకు చెప్పామని, దీనిపై ఉద్యమిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వంలో బిసిల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఈ శాఖకు సబ్‌ప్లాన్‌ ద్వారా జనాభాకు తగ్గట్టు నిధులు కేటాయించి వాటిని ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
బిసిలే తెదేపాకు వెన్నెముక
తెలుగుదేశం పార్టీని ఎన్‌టి రామారావు ఏర్పాటు చేసినప్పుడు వెనకబడిన తరగతులవారే ఆదరించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని చంద్రబాబు హర్షద్వానాల మధ్య చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో బిసిలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడ్డారని, చేతివృత్తుల వారిని, కులవృత్తులవారిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బిసి విభాగం అధ్యక్షుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, బీసీ రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రిపబ్లిక్‌డే రోజునే అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో బిసిల అభ్యున్నతి కోసం మురళీధర్‌ కమిషన్‌ ఏర్పాటుచేసి ఆ కమిటీ సిఫారసులను అమలుపరిచామని చంద్రబాబు గుర్తుచేశారు. గీత కార్మికుల లైసెన్స్‌ పునరుద్ధరణ ఐదేళ్ళకు ఒకసారిగా వెసులుబాటు కల్పించామని, ఆదరణ పథకం ద్వారా వెనకబడిన వర్గాలవారికి ఆధునిక పనిముట్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. బిసిల సామాజిక, ఆర్థిక పరిస్థితుల అధ్యయనం కోసం కేల్కర్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కమిషన్‌ చేసిన సిఫారసులను అమలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ల సిఫారసును 1990లో ఎన్‌టిఆర్‌ చైర్మన్‌గా నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వమే అమలు చేసిందని చంద్రబాబు చెప్పారు. సమాజంలో 50 శాతం ఉన్న వెనకబడిన వర్గాలు ఏమాత్రం అభివృద్ధి జరగలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు. కులవృత్తులు, చేతివృత్తులు దెబ్బతిని బిసిలు వలస కూలీలుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.  సామాజిక న్యాయమని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తనకు కేంద్రంలో మంత్రి పదవి వస్తే న్యాయం జరిగినట్లు భావిస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పార్టీనే కాంగ్రెస్‌కు అమ్ముకున్న చిరంజీవి ఢిల్లిd నాయకుల చుట్టు పదవికోసం పాకులాడుతున్నాడని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో తెదేపా సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు తదితరులు ప్రసంగించారు.

Leave a Reply

free website analytics