వెయ్యి అడుగుల జాతీయ జెండాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా గుత్తిలో 1064, కదిరిలో 1060 అడుగుల జాతీయ జెండాలను ప్రదర్శించారు. గుత్తి ఆర్‌ఎస్ మాజీ ఉప సర్పంచ్, టౌన్ బ్యాంకు డెరైక్టర్ కర్ణాటి మధుసూదన్ గుప్తా కలిసి 1064 అడుగుల జాతీయ జెండాను నెల రోజులు శ్రమించి రూపొందించారు. ఈ జెండాను గుత్తి ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తా సోదరుడు కొట్రికే శ్రీహరి, ఆయన సతీమణి శిరీషా కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ఆవిష్కరించారు. అక్కడి నుంచి సీఎస్‌ఐ చర్చి, సాయిబాబా, అమృత్ థియేటర్ మీదుగా గాంధీచౌక్, ఆర్‌టీసీ బస్టాండ్, రాజీవ్‌గాంధీ సర్కిల్, మన్రోసత్రం, పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగిన ర్యాలీలో జై స్వతంత్య్ర భారత్‌కీ జై.. గణతంత్ర భారత్‌కి జై అంటూ విద్యార్థులు, పట్టణ ప్రముఖులు నినాదాలు చేశారు.
కదిరిలో హరీష్ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం రిపబ్లిక్‌డేను పురస్కరించుకుని పట్టణంలో 1060 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. పట్టణానికి చె ందిన డి. లక్ష్మినారాయణ ఈ జెండాను రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొని ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి వేమారెడ్డి సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా జీవిమాను కూడలి చేరుకొని తిరిగి 205 జాతీయ రహదారి మీదుగా బాలుర కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు.

Leave a Reply

free website analytics