వైఎస్ కృషితోనే మున్సిపాలిటీలకు కొత్తరూపం – మంత్రి ఆనం

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషితోనే దేశంలో ఎక్కడాలేని విధంగా మున్సిపాలిటీలకు కొత్తరూపం వచ్చిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొనియాడారు. వైఎస్ చేపట్టిన చర్యలతో రాష్ట్రంలోని లక్షలాది మంది మున్సిపల్ ఉద్యోగ, కార్మిక వర్గాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాయలసీమ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్‌చే ‘డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మున్సిపల్ బస్టాండ్’లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని మంత్రులు రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఆనం మాట్లాడుతూ వైఎస్ హయాంలో అనేక సంఘాలు లబ్ధిపొందినా హిందూపురంలో మున్సిపల్ ఉద్యోగ యూనియన్లచే ఆయన విగ్రహావిష్కరణ చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఏ ఉద్యోగ సంఘాలు చేయని తరహాలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల యూనియన్ నాయకులను మంత్రి అభినందించారు. వైఎస్ హయాంలో మున్సిపాలిటీల అభివృద్ధికి, మున్సిపల్ ఉద్యోగ, కార్మిక వర్గాల సంక్షేమానికి చేపట్టిన చర్యలు ఎనలేనివన్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల పాటు మున్సిపల్ ఉద్యోగులు ట్రెజరీ ద్వారా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలే ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు పొందేందుకు ప్రయత్నాలు సాగించినా ఫలించలేదన్నారు. అయితే వైఎస్ ఆయా వర్గాల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని, ప్రజాసేవలో మున్సిపల్ యంత్రాంగం పాత్రను గమనించి వారి కలను సఫలం చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఉద్యోగులు వైఎస్ కృషి వల్ల ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు పొందుతున్నారని హర్షధ్వానాల నడుమ మంత్రి పేర్కొన్నారు. వైఎస్ చేసిన మేలును మున్సిపల్ ఉద్యోగులు కలకాలం గుర్తుంచుకుంటారని మంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగులు ప్రతి నెలా ట్రెజరీ ద్వారా ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తున్నందున 2009 సంవత్సరానికి రూ. 179.4 కోట్లను రూ. 287 కోట్లకు పద్దుల్లో కుదించామన్నారు. ఈ వ్యయం ఏడాదికే రూ. 380 కోట్లకు పెరగ్గా, 2010కి రూ.450 కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చిందన్నారు. తాజాగా వేతనాల సవరణ పథకం కారణంగా రూ. 500 కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకు భారమవుతున్నా వైఎస్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోందన్నారు. పురపాలక సంఘాల అభివృద్ధి ద్వారానే ప్రజాసేవకు మెరుగైన అవకాశం ఏర్పడుతుందని వైఎస్ గ్రహించి ఈ దిశగా చర్యలు చేపట్టారన్నారు. ప్రజా సంక్షేమానికి వైఎస్ చేసిన కృషి ఎనలేనిదని మంత్రి ఆనం కొనియాడారు. ట్రెజరీ ద్వారా వేతనాలు అందిస్తున్నప్పటి నుండి మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు పని స్వభావం కూడా మెరుగుపడిందన్నారు. గతంలో రాష్ట్రంలోని 125 మున్సిపాలిటీలకు గాను 93 మున్సిపాలిటీలకు కనీసం సొంత భవనాలు కూడా లేవన్నారు. అయితే సిఎంగా వైఎస్ బాధ్యతలు చేపట్టిన అనంతరం రూ. 50.5 కోట్ల వ్యయంతో ఒక్కో మున్సిపాలిటీకి రూ. 1.5 కోట్లు మంజూరు చేసి కార్యాలయ భవన నిర్మాణాలకు ఊపిరి పోశారన్నారు. అదేవిధంగా 95 మున్సిపాలిటీల్లో దాహార్తి తీర్చేందుకు వైఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వంచే రూ. 12,400 కోట్ల నిధులు (యూఐడిఎస్‌ఎస్‌ఎంటి) మంజూరు చేయించడంతో వైఎస్ కృషి ఎంతో ఉందన్నారు. ఇప్పటికే వైఎస్ ఆలోచన మేరకు రూ.4వేల కోట్లను వెచ్చించి దాహార్తి తీర్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. మరికొద్ది కాలంలోనే అన్ని మున్సిపాలిటీల్లో నీటి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇకపోతే మున్సిపాలిటీల పరిధిలో మురికివాడలు లేకుండా నిరుపేద కుటుంబాల సంక్షేమానికి వైఎస్‌ఆర్, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల కృషి ఎనలేనిదన్నారు. ఇందులో భాగంగా రాజీవ్ ఆవాజ్ యోజన పథకం కింద దేశంలో మురికి వాడల అభివృద్ధి కోసం రూ. 12వేల కోట్లు ఈ ఏడాదిలోనే ఖర్చు చేయగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.4,800 కోట్లు వ్యయానికి అనుమతులు లభించడం వెనుక వైఎస్ శ్రమ ఎంతో ఉందన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 30 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 7,400 మురికి వాడలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాబోవు ఐదు సంవత్సరాల్లో రూ. 25 వేల కోట్ల నిధులతో మురికివాడల అభివృద్ధిని సాధిస్తామని మంత్రి ఆనం ధీమా వ్యక్తం చేశారు.




