వైమానిక దళ గౌరవ కెప్టెన్‌ సచిన్‌

04.09.01
భారత వాయుసేన గౌరవ ర్యాంకు అయిన గ్రూప్‌ కెప్టెన్‌గా క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ క్రీడాకారునిగా దేశానికి సచిన్‌ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ర్యాంకును కేటాయిస్తున్నట్లు వాయుసేన వర్గాలు తెలిపాయి. కనీస మాత్రపు గగన చోదక అనుభవం లేకుండా వాయుసేన గౌరవ ర్యాంకును పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు సచిన్‌ కావడం విశేషం. 1983లో ప్రపంచ కప్‌ను భారత్‌కు గెలిచి పెట్టిన నాటి కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ను 2008లో ప్రాదేశిక సైన్యం లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాతో వాయుసేన సత్కరించింది. న్కూఢిల్లీలోని వాయుసేన ఆడిటోరియంలో జిగేల్మంటూ జరిగిన కార్యక్రమంలో 37సంవత్సరాల టెండూల్కర్‌ను సేనలోకి తీసుకుంటున్నట్లు వాయుసేన ఛీఫ్‌ ఎయిర్‌మార్షల్‌ పివి నాయక్‌ ఆహూతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వాయుసేన గౌరవం దక్కడం తనకు అమితానందాన్నిచ్చిందని సచిన్‌ అన్నాడు. వాయుసేనలో భాగంగా నిలువ గలిగినందుకు గర్వంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా భారత రత్న అవార్డు పొందాలన్న ఆకాంక్షను సచిన్‌ వ్యక్తం చేసాడు.
భారత సైనిక దళంలో గౌరవ ర్యాంక్‌ను దక్కించుకున్న తొలి క్రీడాకారునిగా కపిల్‌ దేవ్‌ ఘనత సాధించాడు. 2008లో ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినంట్‌ కల్నల్‌ ర్యాంక్‌ పొందాడు. ఇప్పటివరకు 21 మంది ప్రముఖ వ్యక్తులు భారత వైమానిక దళంలో గౌరవ ర్యాంక్‌లు పొందారు. అటువంటి వారిలో తొలి వ్యక్తి రాజా ఆఫ్‌ జవహర్‌ రాజా యశ్వంత్‌రావు. ఆయనకు 1944లో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ ర్యాంక్‌ లభించింది. పారిశ్రామికవేత్త జెఆర్‌డి టాటా 1974లో ఎయిర్‌వైస్‌ మార్షల్‌ అయ్యారు. 1990లో చివరిసారిగా పారిశ్రామికవేత్త విజయపత్‌ సింఘానికా ఎయిర్‌ కమాడోర్‌ అయ్యారు. పౌర విమానయాన శాఖలో ఎటువంటి నేపథ్యంలేని వ్యక్తి ఈ హౌదా పొందిన ఘనత సచిన్‌కే దక్కింది.
తన 21 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో ఏ ఒక్క బుకీ భారత క్రికెటర్‌ వద్దకు రాలేదని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గురించి సచిన్‌ మాట్లాడటం అతడి కెరీర్‌లో ఇదే తొలిసారి. బ్రిటిష్‌ మీడియాలో స్పాట్‌ఫిక్సింగ్‌కు సంబంధించి వచ్చిన వార్తలు క్రికెట్‌ ఆటకు చెడ్డపేరు తీసుకువచ్చాయని అన్నాడు. స్పాట్‌ఫిక్సింగ్‌పై ఐసిసి సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులుగా నిర్ధారణ అయినవారిపై చర్య తీసుకోవాలని సూచించాడు. అయితే ఈ విషయం గురించి వ్యాఖ్యానించేందుకు తానేమీ నిపుణుడను కాదని అన్నాడు. ఈ వార్తలు తనను నిరుత్సాహపరిచాయని అన్నాడు.

Leave a Reply

free website analytics